WT20 Challenge 2022, SNO vs VEL: వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌ 2022 రెండో మ్యాచులో వెలాసిటీ అద్భుత విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని సూపర్‌ నోవాస్‌పై దీప్తిశర్మ నేతృత్వంలోని వెలాసిటీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లకే ఛేదించింది. లేడీ సెహ్వాగ్‌ షెఫాలీ వర్మ (51; 33 బంతుల్లో 9x4, 1x6), లారా వొల్వర్ట్‌ (51 నాటౌట్‌; 35 బంతుల్లో 7x4, 1x6) తిరుగులేని హాఫ్‌ సెంచరీలు చేశారు. దీప్తిశర్మ (24 నాటౌట్‌; 25 బంతుల్లో 2x4) చక్కని నాక్‌తో అలరించింది. అంతకు ముందు సూపర్‌నోవాస్‌లో హర్మన్‌ప్రీత్‌ (71; 51 బంతుల్లో 7x4, 3x6), తానియా భాటియా (36; 32 బంతుల్లో 3x4) అదరగొట్టారు.


మొదట బ్యాటింగ్‌ చేసిన సూపర్‌నోవాస్‌కు సరైన ఆరంభం లభించలేదు. దీప్తి శర్మ తన బౌలర్లను చక్కగా ఉపయోగించడంతో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రియా పునియా (4), డాటిన్‌ (6), హర్లీన్‌ డియోల్‌ (7) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో తానియాతో కలిసి హర్మన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. నిలకగా ఆడుతూ చక్కని భాగస్వామ్యం నెలకొల్పింది. జట్టు స్కోరు 100 వద్ద తానియా ఔటైనా సున్‌ లూస్‌ (21 నాటౌట్‌) అండతో  హర్మన్‌ రెచ్చిపోయింది. హాఫ్‌ సెంచరీ తర్వాత చక్కని సిక్సర్లు, బౌండరీలు బాదింది. ఇక ఛేదనలో షెఫాలీ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! బౌలర్లపై చక్కని ఫుట్‌వర్క్‌ యూజ్‌ చేస్తే విరుచుకుపడింది. దూకుడుగా బౌండరీలు కొట్టింది. ఆమెకు యక్తికా భాటియా (17) అండగా నిలిచింది. జట్టు స్కోరు 80 వద్ద షెఫాలీ ఔటైనా  లారా, దీప్తి విజయం అందించారు.