IPL 2022 What Happens If GT vs RR Qualifier 1 Gets Abandoned Due To Rain :  ఐపీఎల్‌ 2022లో తొలి నాకౌట్‌ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను బలమైన రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీకొట్టనుంది. కీలకమైన ఈ మ్యాచుకు వర్షం గండం పొంచివుందని తెలిసింది. కోల్‌కతాలో ఆకాశం మేఘావృతమైంది. ఒకవేళ వర్షం కురిస్తే ఏం జరుగుతుంది? ఏ జట్టు ఫైనల్‌ చేరుకుంటుంది? నియమావళిలో ఏముంది?


ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో గుజరాత్‌ టైటాన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. 20 పాయింట్లు సాధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 18 పాయింట్లే సాధించిన రన్‌రేట్‌ కారణంగా రెండో స్థానం చేరుకుంది. ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ చేరుకొనేందుకు ఈ రెండు జట్లకు రెండు ఛాన్స్‌లు ఉంటాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. క్వాలిఫయర్‌ వన్‌లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంది. ఆర్సీబీ, లక్నో మధ్య జరిగే ఎలిమినేటర్‌ విన్నర్‌తో తలపడాల్సి ఉంటుంది.


ఆక్యూవెదర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం కోల్‌కతాలో వాతావరణం ప్రస్తుతం చల్లగా ఉంది. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చు. అలా జరిగితే ఏం చేయాలో ఐపీఎల్‌ నియమావళిలో ముందే చెప్పారు. మ్యాచ్‌ మొదలవ్వకుండా వర్షం పడితే గుజరాత్‌ ఫైనల్స్‌ నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. ఎందుకంటే లీగ్‌ దశలో ఎక్కువ మ్యాచులు గెలవడమే ఇందుకు కారణం.


మ్యాచ్ మొదలయ్యాక వర్షం పడితే ఫలితాన్ని మరోలా నిర్దేశిస్తారు. మొదట ఓవర్లను కుదించి ఆడించేందుకు ప్రయత్నిస్తారు. డక్‌వర్త్‌ లూయిస్‌ను తెరపైకి తీసుకొస్తారు. కొన్ని ఓవర్లైనా కుదరకపోతే సూపర్‌ ఓవర్‌ ఆడిస్తారు. సూపర్‌ ఓవరూ కుదరకపోతే పాయింట్ల పట్టికను అనుసరించి విజేతను నిర్ణయిస్తారు. అంటే గుజరాత్‌ టైటాన్స్‌కే ఎక్కువ అనుకూలతలు ఉన్నాయన్నమాట.