WPL Auction 2023:


అరంగేట్రం మహిళల ఐపీఎల్‌ (WPL)కు భారీ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది క్రికెటర్లు లీగు కోసం ఎదురు చూస్తున్నారు. వేలం కోసం ఇప్పటికే 1000 మంది వరకు అమ్మాయిలు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిసింది. ఈ జాబితాను బీసీసీఐ కుదించి ఫ్రాంచైజీలకు ఇవ్వనుంది.


విమెన్‌ ప్రీమియర్‌ లీగుకు ఏర్పాట్లనీ చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంచైజీల వేలం ముగిసింది. బీసీసీఐకి భారీగా డబ్బు సమకూరింది. ఇక ఫిబ్రవరి 13న క్రికెటర్ల వేలం నిర్వహించనుంది. ఇందుకోసం పేర్లు నమోదు చేసుకోవాలని ఆహ్వానించింది. ప్రకటన ఇచ్చిందో లేదో అమ్మాయిలు రిజిస్ట్రేషన్లకు ఎగబడ్డారు. వెయ్యి మందికి పైగా నమోదు చేసుకున్నారని న్యూస్‌18 రిపోర్టు చేసింది. దాంతో ఈ జాబితాను 150కి కుదించాలని బోర్డు భావిస్తోంది.


మహిళల ప్రీమియర్‌ లీగులో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది క్రికెటర్లను తీసుకొనేందుకు బీసీసీఐ అనుమతించింది. అంటే మొత్తం 90 మందికే అవకాశం దొరుకుతుంది. 'డబ్ల్యూపీఎల్‌ వేలానికి విపరీతమైన స్పందన లభిస్తోంది. వెయ్యి మందికి పైగా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. స్థానిక, విదేశీ క్రికెటర్ల నుంచి ఆరోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.


ఫ్రాంచైజీలకు పోటీ


మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే.  ఇందుకోసం ఏకంగా రూ.4669.99 కోట్లను వెచ్చించాయి.  పురుషుల ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు మూడు జట్లు, వ్యాపార సంస్థలు రెండు జట్లను కైవసం చేసుకున్నాయి. మొత్తం 16 సంస్థలు ఫ్రాంచైజీల కోసం పోటీపడ్డాయని తెలిసింది.


ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యాలు ఒక్కో ఫ్రాంచైజీని దక్కించుకున్నాయి. అదానీ గ్రూప్‌, క్యాప్రీ గ్లోబల్‌ మిగిలిన రెండు జట్లను తీసుకున్నాయి. మొత్తానికి మహిళల క్రికెట్‌ లీగుకు 'విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌' అని పేరు పెట్టినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే ఐదు జట్లతో టీ20 లీగ్‌ మొదలవుతుంది. ముంబయి, దిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌, లక్నో ప్రాంతాలను ఫ్రాంచైజీలు ప్రతిబింబిస్తాయి.


ఫ్రాంచైజీల కోసం ముంబయిలో నేడు వేలం జరిగింది. ఇందులో వచ్చిన సీల్డ్‌ బిడ్లను తెరవడంతో బీసీసీఐకి రూ.4669 కోట్ల డబ్బు సమకూరింది. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ అత్యధికంగా రూ.1289 కోట్లకు అమ్ముడుపోయింది. రూ.912 కోట్లతో ముంబయి రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు రూ.901 కోట్లు, దిల్లీ రూ.810 కోట్లు, లక్నో రూ.757 కోట్లతో బిడ్లు వేశాయి. విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూలు ఇంకా పెండింగ్‌లో ఉందని, క్రికెటర్ల వేలమూ నిర్వహించాల్సి ఉందని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ అన్నారు.


మీడియా హక్కులు హిట్‌


మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం ఇంతకు ముందే పూర్తైంది. రిలయన్స్‌ నేతృత్వంలోని వయాకామ్‌ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.951 కోట్లు చెల్లిస్తోంది. అంటే 2023 నుంచి 27 మధ్య జరిగే ప్రతి మ్యాచుకూ రూ.7.09 కోట్లు ఇస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా మీడియా హక్కుల వివరాలను వెల్లడించారు.