Womens IPL 2023:

  2023లో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుకోసం ప్రణాళిక కూడా రూపొందించింది. అందులో భాగంగా మీడియా హక్కుల కోసం బీసీసీఐ బిడ్ లను ఆహ్వానించింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కోసం బిడ్‌లను పిలిచిన బీసీసీఐ.. తాజాగా మీడియా హక్కుల కోసం బిడ్‌లను ఆహ్వానించింది. ఈ బిడ్ ద్వార్ ఐదేళ్లపాటు (2023-27) ప్రసార హక్కులను కల్పించనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. 


‘‘మహిళల టీ20 లీగ్‌ మీడియా హక్కులను పొందేందుకు బిడ్ లను ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆహ్వానిస్తోంది. 2023 - 2027 వరకు 5 సీజన్లకు సంబంధించిన హక్కులను పొందేందుకు బిడ్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. టెండర్‌ ప్రాసెస్‌ ప్రకారం హక్కులను కేటాయించడం జరుగుతుంది’’ అని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటనలో వెల్లడించారు. ఈసారి ఈ- వేలానికి బదులుగా క్లోజ్డ్- బిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ నిర్ణయించింది.


‘ఇన్విటేషన్ టు టెండర్’ (ఐటీటీ) బిడ్‌  డాక్యుమెంట్‌ ఖరీదు రూ. 5 లక్షలు ట్యాక్సులు కాకుండా.  డిసెంబర్ 31వ తేదీ వరకు ఐటీటీని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. బీసీసీఐ విధించిన షరతులను అధిగమిస్తేనే బిడ్‌ దాఖలు చేసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఐటీటీని కొనుగోలు చేసినంత మాత్రాన బిడ్‌ దాఖలు చేసినట్లు కాదు. ఈ ఏడాది పురుష టీ20 లీగ్‌ కోసం బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు దాదాపు రూ. 45 వేల కోట్లకుపైగా అమ్ముడైన విషయం తెలిసిందే.






అప్పటినుంచే మహిళల ఐపీఎల్!


మహిళల ఐపీఎల్ ప్రారంభ సీజన్ న మార్చి 3 నుంచి 26 వరకు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఈ తేదీల్లో అమ్మాయిల ఐపీఎల్ ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 26న కేప్ టౌన్ వేదికగా జరగనున్న 2023 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వుమెన్స్ ఐపీఎల్ జరగనున్నట్లు తెలుస్తోంది. 


మహిళల ఐపీఎల్ స్వరూపం


లీగ్ లో 5 ఫ్రాంచైజీ జట్లు పోటీపడతాయి.
మొత్తం 22 మ్యాచులు ఉంటాయి.
ప్రతి జట్టులో గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు మొత్తం 18 మంది ఉండవచ్చు. 
తుది జట్టులో 5గురు విదేశీ ఆటగాళ్లు (సభ్య దేశాల నుంచి నలుగురు, అసోసియేట్ దేశం నుంచి ఒకరు) ఉండాలి. 
లీగ్ దశలో ప్రతి జట్టు మరో జట్టులో రెండు సార్లు ఆడుతుంది. టేబుల్ టాపర్ గా ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది.
రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచులో ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో ఫైనలిస్ట్ గా ఫైనల్ ఆడుతుంది.