ఐపీఎల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే క్రమంలో బీసీసీఐ మరో కొత్త నియమాన్ని తీసుకురానుందని తెలుస్తోంది. అదే ‘IMPACT PLAYER’ రూల్. దీని ద్వారా మ్యాచ్ జరిగే సమయంలో ప్లేయింగ్ XIలోని ఒక ఆటగాడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను తెచ్చుకోవచ్చు. ఈ నియమాన్ని కంపెనీ ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో పరీక్షించింది. ఈ నిర్ణయంపై జట్లు హర్షం వ్యక్తం చేశాయి కూడా.


ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ నియమాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే పంపించినట్లు సమాచారం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫాలో అయిన రూల్‌నే ఇప్పుడు కూడా ఫాలో అవుతారని అనుకోవచ్చు.


‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమం ప్రకారం ఒక జట్టు తుదిజట్టులో ఆడే 11 మందితో పాటు నలుగురు ఆటగాళ్లను ‘tactical substitutions’గా ఎంచుకోవచ్చు.  జట్టు ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌లోపు ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకురావచ్చు.


ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎలా పని చేస్తుంది?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో వేగంగా ఆడే పృథ్వీ షా త్వరగా అవుట్ అయిపోయాడు అనుకుందాం. డ్రెస్సింగ్ రూంలో ఉన్న నలుగురు సబ్‌స్టిట్యూషన్స్‌లో యశ్ ధుల్ కూడా వేగంగా ఆడే సామర్థ్యాన్ని కలిగి ఉంటే తనని వెంటనే బ్యాటింగ్‌కు తీసుకురావచ్చు.


ఇక బౌలింగ్ జట్టు విషయానికి వస్తే... చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దీపక్ చాహర్ నాలుగు ఓవర్ల స్పెల్ మొదటి ఎనిమిది ఓవర్లలోనే పూర్తి చేశాడనుకుందాం. అయితే అక్కడి పరిస్థితులకు తన లాంటి బౌలర్ అవసరం అనుకుంటే తన స్థానంలో శామ్ కరన్‌ను బౌలింగ్‌కు తీసుకురావచ్చు. తనతో నాలుగు ఓవర్ల పూర్తి కోటా కూడా మళ్లీ వేయించవచ్చు.


ఇది ఐపీఎల్‌ను మరింత ఆసక్తికరంగా మారుస్తుందా? లేక మరిన్ని విమర్శలకు తావిస్తుందా అనేది చూడాలి.