ఆస్ట్రేలియన్ క్రేజీ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ వేలానికి పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవలే భారత్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో తనపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఈ దశలో కామెరాన్ గ్రీన్‌ను డేవిడ్ వార్నర్ హెచ్చరించాడు. టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌లు అన్నీ కలుపుకుంటే దాదాపు ఆరు నెలలకు పైగా భారతదేశంలోనే ఉండాల్సి వస్తుందని ఇక్కడి వాతావరణానికి తను తట్టుకోవడం కష్టం అవుతుందన్నాడు. దీంతోపాటు వచ్చే సంవత్సరం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో కూడా ఆస్ట్రేలియా పర్యటించనుంది.


వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ముందు వార్నర్ మాట్లాడుతూ, "పంతొమ్మిది వారాలు భారతదేశంలో నీ మొదటి పర్యటన చాలా సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వేడిని తట్టుకుని ఆడటం, తిరిగి కోలుకోవడం చాలా కీలకం." అన్నాడు.


"నేను కూడా దానిని ఎదుర్కొన్నాను. నేను టెస్ట్ సిరీస్, IPL ఆడాను. ఇది చాలా కఠినమైనది. దీంతోపాటు మీరు ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడు మీకు ముందు 20 రోజుల గ్యాప్ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. మీరు దక్షిణాఫ్రికాకు వెళ్లి, ఆపై ప్రపంచ కప్‌కు వెళ్లండి." అని సలహా ఇచ్చాడు.


"కామెరాన్ గ్రీన్ యువకుడే కాబట్టి అది పూర్తిగా అతని నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా తనకు చాలా కెరీర్ ఉంది. ఇది తనకు చాలా పెద్ద నిర్ణయం. ఆటగాడిగా తను ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేం గౌరవిస్తాం. కానీ అంతిమంగా, అది అతనికి, క్రికెట్ ఆస్ట్రేలియాకి (CA)కి సంబంధించినది." అన్నాడు.


ఇది కఠినంగా ఉంటుందని తనకు తెలుసని, అయితే కఠినమైన షెడ్యూల్‌లో కొనసాగడానికి తనకు సరైన మద్దతు వ్యవస్థ ఉందని నమ్ముతున్నానని కామెరాన్ గ్రీన్ చెప్పాడు.