IPL 2023 Auction Date:  వచ్చే ఏడాది ఐపీఎల్ కు సన్నాహకాలు జోరందుకున్నాయి. ఇప్పటికే తాము అట్టిపెట్టుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్టును ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐకు అందజేశాయి.  ఐపీఎల్ 2023 ఎడిషన్ కోసం డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ తేదీని మార్చాలని కొన్ని ఫ్రాంచైజీలు బోర్డును అభ్యర్థించాయి. అయినా కూడా వేలం తేదీలను బోర్డు మార్చబోవడం లేదని వార్తలు వస్తున్నాయి. 


దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడినట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు క్రిస్మస్ సెలవులను పురస్కరించుకుని వేలం తేదీని మార్చమని అడిగారు. వారి అభ్యర్థనను మేం అర్ధం చేసుకోగలం. అయితే తేదీని మార్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో సమీకరణాలు ఉన్నాయి. తేదీని మార్చితే ప్రతిదాన్ని మార్చాలి. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మినీ వేలం ఆ సమయానికే జరుగుతుంది. అని ఆయన చెప్పినట్లు సమాచారం. 


డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ. కాబట్టి చాలా ఫ్రాంచైజీల సభ్యులు పండుగ జరుపుకోవడంలో ఉంటారు. తేదీని మారిస్తే ఫ్రాంచైజీల తరఫున ఎక్కువమంది వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అందుకనే తేదీని మార్చాలని బీసీసీఐ అభ్యర్థించారు. దాన్ని బీసీసీఐ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 


ఆసక్తికరంగా మినీ వేలం


ఈసారి మినీ వేలం ఆసక్తికరంగా ఉండబోతోంది. కొంతమంది స్టార్ ఆటగాళ్లు వేలంలోకి రాబోతున్నారు. కేన్ విలియమ్సన్, బెన్ స్టోక్స్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్, కామెరూన్ గ్రీన్ వంటి విదేశీ ప్లేయర్స్ వేలానికి అందుబాటులో ఉంటారు. అలానే దేశవాళీ టోర్నీల్లో రాణించిన భారత ఆటగాళ్లు మంచి ధర పలికే అవకాశం ఉంది. అన్ని ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 163 మంది ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకున్నాయి. 85 మందిని విడుదల చేశాయి.










 


 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది మెగా వేలం కాదు.
మినీ వేలం. గత వేలంలో తమ పర్సులో డబ్బు మిగిలిన వారు, ఇప్పుడు విడుదల చేసే ఆటగాళ్ల విలువకు తోడు జట్లకు అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు సమాచారం. 


పంజాబ్ వద్ద ఎక్కువ డబ్బు


2022లో జరిగిన మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ. 3.45 కోట్ల డబ్బు మిగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 1.55 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ రూ. 95 లక్షలు, కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 45 లక్షలు, గుజరాత్ టైటాన్స్ రూ. 15 లక్షలతో ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ వద్ద తలా రూ. 10 లక్షలు మిగిలాయి. లక్నో సూపర్ జెయింట్స్ పర్సు మొత్త ఖాళీ అయిపోయింది.