Gautam Gambhir:  ఐపీఎల్ వల్లే టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో సరిగ్గా ఆడడంలేదనే వ్యాఖ్యలు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి. ఆ లీగ్ వల్లే ప్రధాన టోర్నీల్లో భారత ప్రదర్శన పడిపోతుందనే విమర్శలు వినవస్తున్నాయి. వీటిపై తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పందించాడు. భారత టీ20 లీగ్‌ వల్లే భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించలేకపోతున్నారనే వ్యాఖ్యలతో తాను విభేదిస్తానని అన్నాడు. 


ప్రతిసారి ఐపీఎల్ దే తప్పంటే ఎలా


'ఐసీసీ టోర్నమెంట్లలో రాణించకపోతే నిందించాల్సింది ఆటగాళ్లను, వారి ప్రదర్శనను. అంతేకానీ భారత టీ20 లీగ్ ను కాదు. ఐపీఎల్ రాకతో మన దేశంలో క్రికెట్ కు గొప్ప మేలు జరిగింది. ఈ లీగ్ ప్రారంభమైన నాటినుంచి దీనిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. టీమిండియా వైఫల్యం చెందిన ప్రతిసారి ఐపీఎల్ తప్పుపట్టడం సరికాదు. ఒక ఆటగాడు 35- 36 ఏళ్ల వయసు వరకే సంపాదించగలదు. వారికి ఆర్థిక భద్రత కల్పించడం చాలా ముఖ్యం. అది ఐపీఎల్ ద్వారా కలుగుతుంది. దీని ద్వారా పొందే ఆదాయం క్రీడాకారుల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది' అని గంభీర్ అన్నాడు. 


భారత జట్టుకు భారతీయుడే కోచ్ గా ఉండాలి


ఐపీఎల్ లో ఎక్కువమంది భారత కోచ్ లను తీసుకురావడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలను ఈ మాజీ లెఫ్ట్ హ్యాండర్ ప్రశంసించాడు. 'భారత జట్టుకు ఒక భారతీయుడే కోచ్ గా ఉండాలని నేను బలంగా నమ్ముతాను. ఈ లీగ్ వల్ల అది జరుగుతోంది. జాతీయ జట్టుకు కూడా భారతీయ కోచ్ శిక్షణ ఇస్తున్నాడు. విదేశీ కోచ్ లకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. వారు ఇక్కడకు వచ్చి డబ్బులు సంపాదిస్తారు. కానీ బిగ్ బాష్ వంటి విదేశీ లీగుల్లో మన కోచ్ లు ఉన్నారా! లేరు. క్రికెట్ లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. మనవారికి మనమే మరిన్ని అవకాశాలు కల్పించాలి. క్రీడల్లో భావోద్వేగాలు ముఖ్యమైనవి. దానిని అనుభూతి చెందిన వారే జట్టును సమర్ధంగా నడిపించగలరు' అని గౌతీ అన్నాడు. 






దేశాభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషించబోతున్నాయని గంభీర్ అన్నాడు. ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడను ఎంచుకుని దానిమీద సంపూర్ణ శ్రద్ధ వహించాలని సూచించాడు. ఒడిశా హాకీని అలాగే అభివృద్ధి చేసిందని గుర్తుచేశాడు. ఇలా చేస్తే ఒలింపిక్స్ లో భారత్ కూడా గర్వించదగ్గ స్థాయిలో ఉంటుందన్నాడు. బీసీసీఐ తన నిధుల నుంచి 50 శాతాన్ని ఇతర ఒలింపిక్‌ క్రీడల కోసం వెచ్చించాలని కోరాడు.  


గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు మెంటార్ గా ఉన్నాడు. అంతకుముందు ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా ఉన్న గంభీర్.. తన జట్టుకు రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ ను అందించాడు.