IPL 2023:  మహిళల ఐపీఎల్ ప్రారంభ సీజన్ న మార్చి 3 నుంచి 26 వరకు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ ఈ తేదీల్లో అమ్మాయిల ఐపీఎల్ ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 26న కేప్ టౌన్ వేదికగా జరగనున్న 2023 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వుమెన్స్ ఐపీఎల్ జరగనున్నట్లు తెలుస్తోంది. 


మీడియా హక్కుల కోసం టెండర్లు


మహిళల ఐపీఎల్ మొదటి 5 సీజన్ల మీడియా హక్కుల కోసం బీసీసీఐ శుక్రవారం టెండర్లు ఆహ్వానించింది. టెండర్ వేసేందుకు డిసెంబర్ 31 చివరితేదీ. ఈసారి ఈ- వేలానికి బదులుగా క్లోజ్డ్- బిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ నిర్ణయించింది. బిడ్డర్లు టెండర్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి. టెలివిజన్, డిజిటల్, టీవీ ప్లస్ డిజిటల్... ఈ మూడు విభాగాలకు బేస్ ధర ఎంతనేది బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. 


మహిళల ఐపీఎల్ కోసం ఈ ఏడాది అక్టోబరులో బీసీసీఐ.. రాష్ట్ర సంఘాలు, తన సభ్యులతో ఒక ప్రణాళిక గురించి చర్చించింది. ఇది బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు.


మహిళల ఐపీఎల్ స్వరూపం



  • లీగ్ లో 5 ఫ్రాంచైజీ జట్లు పోటీపడతాయి.

  • మొత్తం 22 మ్యాచులు ఉంటాయి.

  • ప్రతి జట్టులో గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు మొత్తం 18 మంది ఉండవచ్చు. 

  • తుది జట్టులో 5గురు విదేశీ ఆటగాళ్లు (సభ్య దేశాల నుంచి నలుగురు, అసోసియేట్ దేశం నుంచి ఒకరు) ఉండాలి. 

  • లీగ్ దశలో ప్రతి జట్టు మరో జట్టులో రెండు సార్లు ఆడుతుంది. టేబుల్ టాపర్ గా ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది.

  • రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచులో ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో ఫైనలిస్ట్ గా ఫైనల్ ఆడుతుంది. 


 






పురుషుల ఐపీఎల్


పురుషుల ఐపీఎల్ 2023 ఎడిషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు.  ఇందులో 10 జట్లు ఉంటాయి. అయితే దీనికి తేదీని నిర్ణయించే ముందు బీసీసీఐ విదేశీ ఆటగాళ్ల లభ్యతపై కసరత్తు చేస్తోంది. అలాగే హోం అండ్ ఎవే పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించనుంది. జూన్ 1 నుంచి 4 వరకు ఇంగ్లండ్ జట్టు లార్డ్స్ లో ఐర్లాండ్ తో ఏకైక టెస్టులో ఆడబోతోంది. కాబట్టి మే నెలాఖరులోగా ఐపీఎల్ ను ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే యాషెస్ జూన్ 16 నుంది ప్రారంభం కానుంది.