Who is Sabbhineni Meghana andhra cricketer represents Trailblazers : మహిళల ఐపీఎల్‌లో ఆంధ్రా అమ్మాయి సబ్బినేని మేఘన (Sabbhineni Meghana) అదరగొట్టింది. ఓ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకుంది. మహిళల టీ20 ఛాలెంజ్‌లో తన జట్టు విజయానికి కీలకంగా మారింది. ఎంతకీ ఎవరీమె?


మహిళల టీ20 ఛాలెంజ్‌లో గురువారం రాత్రి ట్రయల్‌ బ్లేజర్స్‌, వెలాసిటీ మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌కు మేఘన ఆడింది. తన ఓపెనింగ్‌ పాట్నర్‌ స్మృతి మంధాన త్వరగా ఔటైనా ఆమె మాత్రం రెచ్చిపోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ (66; 44 బంతుల్లో 7x4, 1x6)తో కలిసి పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకుంది. కేవలం 47 బంతుల్లోనే 7 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసింది. 155.31 రన్‌రేట్‌తో దుమ్మురేపింది. దాంతో రెండో వికెట్‌కు 73 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఈ మ్యాచులో ట్రయల్‌ బ్లేజర్స్‌ 190/5 స్కోర్‌ చేయగా వెలాసిటీ 174/9కి పరిమితం అయింది.


సబ్బినేని మేఘనది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా. 1996, జూన్‌7న జన్మించింది. కుడిచేతి వాటం బ్యాటర్‌. రైటార్మ్‌ మీడియం ఫాస్ట్ బౌలింగ్‌ చేస్తుంది. ఎక్కువగా ఓపెనింగ్‌ చేస్తుంటుంది. ఆంధ్రా విమెన్‌, ఇండియా విమెన్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. ఈ ఐపీఎల్‌ సీజన్లో ట్రయల్‌ బ్లేజర్స్‌కు ఆడుతోంది. ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీలు కొట్టడం, భారీ సిక్సర్లు బాదడం ఆమె స్పెషల్‌. మహిళల వన్డేల్లో ఇప్పటి వరకు 3 మ్యాచుల్లో 38 సగటు, 108 స్ట్రైక్‌రేట్‌తో 114 పరుగులు చేసింది. 7 టీ20ల్లో 91 పరుగులు చేసింది. గతేడాది చివరి నుంచి మేఘన మంచి ఫామ్‌లో ఉంది. ఇండియా విమెన్‌- డి తరఫున 60, 102, 0, 45 రన్స్‌ కొట్టింది. క్వీన్స్‌టౌన్‌లో న్యూజిలాండ్‌ విమెన్‌పై వరుసగా 37, 4, 49, 61 రన్స్‌తో చెలరేగింది.