Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో చెన్నై చివరి మ్యాచ్ ఫలితం లక్నో ఎలిమినేషన్‌పై పడింది.

Continues below advertisement

ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిపోయి లక్నో ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. లక్నో నిష్క్రమణపై లీగ్ దశలో చెన్నై చివరి మ్యాచ్ ప్రభావం కూడా ఉంది. ఎందుకంటే చెన్నై గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్‌తో ఆడింది. ఈ మ్యాచ్ సమయానికి లక్నో తొమ్మిది విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా... రాజస్తాన్ ఎనిమిది విజయాలతో మూడో స్థానంలో ఉంది. కానీ నెట్ రన్‌రేట్ విషయంలో రాజస్తాన్ ముందంజలో ఉంది.

Continues below advertisement

ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 43 పరుగులు కావాల్సి ఉంది. కీలక బ్యాట్స్‌మెన్ అందరూ అవుట్ అయిపోయిన తరుణంలో చివర్లో రవిచంద్రన్ అశ్విన్ సిక్సర్లతో చెలరేగి రాజస్తాన్‌ను విజయాన్ని అందిస్తాడు. అశ్విన్‌ని కట్టడి చేయడంలో చెన్నై సఫలమై ఉంటే రాజస్తాన్ మూడో స్థానంలో ఉండేది. లక్నో, గుజరాత్‌తో క్వాలిఫయర్-1 ఆడేది.

క్వాలిఫయర్-1లో ఓటమి పాలైనా క్వాలిఫయర్-2 అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎలిమినేటర్ ఆడాల్సి రావడంతో ఒక్క ఓటమికే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. క్వాలిఫయర్-1లో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరింది. ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్... క్వాలిఫయర్-2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

ఆ ఒక్క మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించి ఉంటే ఇప్పుడు ప్లేఆఫ్స్ ముఖచిత్రమే మారిపోయి ఉండేది. 

Continues below advertisement