Hardik Pandya in Team India Captaincy race : ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)కు బిగ్‌ ప్రమోషన్‌ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2022లో అతడు గుజరాత్‌ టైటాన్స్‌ను నడిపిస్తున్న తీరుకు సెలక్టర్లు ఫిదా అయ్యారని సమాచారం! దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ముగియగానే దీనిపై మరింత స్పష్టత రానుంది.


మునుపటితో పోలిస్తే హార్దిక్‌ పాండ్య ఇప్పుడు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఎక్కువ పరిణతి ప్రదర్శిస్తున్నాడు. బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. అదే సమయంలో ఫిట్‌నెస్‌పై ఏకాగ్రత కనబరుస్తున్నాడు. నియంత్రిత దూకుడుతో ఆకట్టుకుంటున్నాడు. ప్రతి బంతిని దంచికొట్టడం కాకుడా అవతలి బౌలర్లను గౌరవిస్తున్నాడు. చెత్త బంతి దొరికితే బౌండరీకి శిక్షిస్తున్నాడు. క్రీజులో కూల్‌గా ఉంటున్నాడు. ఇక బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సమయోచితంగా బంతిని అందుకుంటున్నాడు. 140 కి.మీ వేగంతోనూ విసురుతున్నాడు. పరుగుల్ని నియంత్రించడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. నాయకుడిగా తన ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న తీరు మాజీ క్రికెటర్లను మెప్పించింది.


ఐపీఎల్‌ 2022లో హార్దిక్‌ పాండ్య అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. 2 సీజన్లో 14 మ్యాచుల్లో 45.30 సగటు, 132 స్ట్రైక్‌రేట్‌తో 453 పరుగులు చేశాడు. నాలుగు అర్ధశతకాలు అందుకున్నాడు. 41 సగటు, 31.80 స్ట్రైక్‌రేట్‌, 7.74 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. 159 బంతుల్లో 205 పరుగులు ఇచ్చాడు.


'హార్దిక్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌, ఆటగాడిగా మరింత బాధ్యతగా ఉండటం సంతృప్తిగా అనిపిస్తోంది. ఐర్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా కెప్టెన్సీ రేసులో అతడి పేరుంది. ఇప్పుడే అతడి పేరు ప్రకటించడం తొందరపాటే అవుతుంది. అతడి గురించి చర్చ జరుగుతోంది. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ ముగిశాక దీనిపై సమగ్రంగా చర్చిస్తాం. అతడు ఫిట్‌నెస్‌ కొనసాగిస్తూ ఫామ్‌లో ఉండటం ముఖ్యం. జట్టులో అతడు కీలక సభ్యుడు' అని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ వర్గాలు చెప్పినట్టు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌ రిపోర్ట్‌ చేసింది.


ఐపీఎల్‌ తర్వాత జరిగే దక్షిణాఫ్రికాలో సిరీసులో టీమ్‌ఇండియాకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఉంటాడు. రోహిత్‌, కోహ్లీ, షమి, బుమ్రా వంటి చాలామంది సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు. వారు నేరుగా ఇంగ్లాండ్‌ పర్యటనకు వస్తారు. ఈ మధ్యలోనే ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉన్నాయి. బర్మింగ్‌ హామ్‌ టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు వెళ్లి వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండటంతో కేఎల్‌ రాహుల్‌, రిషభ్ పంత్‌, రోహిత్‌ ఆ సిరీస్‌కు అందుబాటులో ఉండరు. శిఖర్ ధావన్‌ ఎలాగూ టీ20 బరిలో లేడు. దాంతో భువనేశ్వర్‌ కుమార్‌ ఒక్కడే హార్దిక్‌కు పోటీగా ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.