Womens IPL Bidders:


అమ్మాయిల క్రికెట్‌కు మహర్దశ పట్టనుంది! మహిళల ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి. ఇందుకోసం ఏకంగా రూ.4669.99 కోట్లను వెచ్చించాయి.  పురుషుల ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు మూడు జట్లు, వ్యాపార సంస్థలు రెండు జట్లను కైవసం చేసుకున్నాయి. మొత్తం 16 సంస్థలు ఫ్రాంచైజీల కోసం పోటీపడ్డాయని తెలిసింది.


ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యాలు ఒక్కో ఫ్రాంచైజీని దక్కించుకున్నాయి. అదానీ గ్రూప్‌, క్యాప్రీ గ్లోబల్‌ మిగిలిన రెండు జట్లను తీసుకున్నాయి. మొత్తానికి మహిళల క్రికెట్‌ లీగుకు 'విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌' అని పేరు పెట్టినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే ఐదు జట్లతో టీ20 లీగ్‌ మొదలవుతుంది. ముంబయి, దిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌, లక్నో ప్రాంతాలను ఫ్రాంచైజీలు ప్రతిబింబిస్తాయి.


ఫ్రాంచైజీల కోసం ముంబయిలో నేడు వేలం జరిగింది. ఇందులో వచ్చిన సీల్డ్‌ బిడ్లను తెరవడంతో బీసీసీఐకి రూ.4669 కోట్ల డబ్బు సమకూరింది. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ అత్యధికంగా రూ.1289 కోట్లకు అమ్ముడుపోయింది. రూ.912 కోట్లతో ముంబయి రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు రూ.901 కోట్లు, దిల్లీ రూ.810 కోట్లు, లక్నో రూ.757 కోట్లతో బిడ్లు వేశాయి. విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూలు ఇంకా పెండింగ్‌లో ఉందని, క్రికెటర్ల వేలమూ నిర్వహించాల్సి ఉందని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ అన్నారు.


'క్రికెట్లో ఇదో చారిత్రక రోజు. 2008లో పురుషుల ఐపీఎల్‌ ఆరంభ రికార్డులను మహిళల ప్రీమియర్‌ లీగ్‌ బద్దలు కొట్టింది. ఫ్రాంచైజీ విజేతలకు అభినందనలు. మాకు రూ.4669 కోట్ల సంపద సమకూరింది. ఇది మహిళల క్రికెట్లో విప్లవానికి నాంది పలుకుతుంది. కేవలం అమ్మాయిల క్రికెట్‌కే కాదు మొత్తం క్రీడా ప్రపంచానికీ పరివర్తన తీసుకురానుంది. డబ్ల్యూపీఎల్‌ మహిళల క్రికెట్లో సంస్కరణలు తీసుకురానుంది. లీగులో భాగమైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందించనుంది. బీసీసీఐ ఈ లీగుకు విమెన్స్‌ ప్రీమియర్‌ లీగుకు పేరు పెట్టింది. ఇక ప్రయాణం మొదలు' అని బీసీసీఐ కార్యదర్శి జే షా వరుస ట్వీట్లు చేశారు.


మీడియా హక్కులూ సూపర్‌ హిట్‌


మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం ఇంతకు ముందే పూర్తైంది. రిలయన్స్‌ నేతృత్వంలోని వయాకామ్‌ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.951 కోట్లు చెల్లిస్తోంది. అంటే 2023 నుంచి 27 మధ్య జరిగే ప్రతి మ్యాచుకూ రూ.7.09 కోట్లు ఇస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా మీడియా హక్కుల వివరాలను వెల్లడించారు.


'మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల విజేత వయాకామ్‌ 18ను అభినందనలు. పురుషుల, మహిళల క్రికెట్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. రాబోయే ఐదేళ్లకు వయాకామ్‌ రూ.951 కోట్లను చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచు విలువ రూ.7.09 కోట్లు. మహిళల క్రికెట్‌కు ఇదో గొప్ప విజయం' అని జే షా ట్వీట్‌ చేశారు.


'సమాన వేతనాల తర్వాత మహిళల క్రికెట్‌ సాధించిన మరో గొప్ప విజయం మీడియా హక్కుల బిడ్డింగ్‌. దేశంలో మహిళా క్రికెట్‌ సాధికారతకు ఇదో గొప్ప ముందడుగు. అన్ని వయసుల్లోని అమ్మాయిలు లీగులో పాల్గొనేందుకు ఇది ప్రేరణ కల్పించనుంది. ఇది సరికొత్త సూర్యోదయం' అని ఐసీసీ, బీసీసీఐ మహిళలను జే షా ట్యాగ్‌ చేశారు.