Virender Sehwag Comments: విధ్వంసక క్రికెట్ కు పెట్టింది పేరయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో తేలిపోతోంది. ఇప్పటివరకు టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడిన సన్.. మూడింటిలో ఓడిపోయి, ఒక్కదాంట్లోనే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానమైన పదో ప్లేస్ లో నిలిచింది. ఇక తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోరంగా 80 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక సన్ డౌన్ ఫాల్ గురించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా వ్యాఖ్యానించాడు. సన్ రైజర్స్ తన చార్మ్ ను కోల్పోతోందని, ఒకప్పుడు ఎంటర్ టైన్ చేసిన జట్టు నేడు వెలవెల బోతోందని ఆక్షేపించాడు. గతేడాది విధ్వంసక ఆటతీరుతో సన్.. ఒక క్రేజ్ తెచ్చుకుందని, తాజా సీజన్ లో ఏ వేదికలో ఆడిన సన్ కోసమే అభిమానులు వచ్చేవారని, అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఒకప్పటి పంజాబ్ లా..
ప్రస్తుత ఆటతీరు చూస్తుంటే ఒకప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులా కనిపిస్తోందని సెహ్వాగ్ ఎద్దేవా చేశాడు. ఒకప్పుడు చెత్త ఆటతీరుతో పంజాబ్ అప్రతిష్ట మూటగట్టుకుందని, ఇప్పుడా స్థానాన్ని సన్ భర్తీ చేస్తోందని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్ లో రాయల్స్ పై గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు రాన్రాను దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 190 పరుగులు కొట్టినా, కాపాడుకోలేకపోయారని, ఆ తర్వాత మూడో మ్యాచ్ లో ఢిల్లీపై కనీసం 165 పరుగులు కూడా చేయలేక పోయారని పేర్కొన్నాడు. తాజాగా నాలుగో మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో 120 పరుగులకే కుప్పకూలి అందరినీ నిరాశపర్చారని తెలిపాడు.
పిచ్ ప్రాబ్లం కాదు..
కేకేఆర్ తో మ్యాచ్ లో పిచ్ ప్రాబ్లం కాదని, సన్ ఆటగాళ్ల ఆలోచనలోనే ప్రాబ్లం ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఫస్ట్ కేకేఆర్ 200 పరుగులు చేసిందని, పిచ్ కాస్త స్లోగా ఉందని, ఇక్కడ బ్యాటింగ్ చేయాలంటే కాసేపు ఓపిక పడితే సరిపోతుందని తెలిపాడు. అయితే సన్ ఆటగాళ్లు అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని పేర్కొన్నాడు. ఇక తమ ఆటగాళ్లు గాడిన పడతారాని సన్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలోనే తమ బ్రాండ్ విధ్వంసక ఆటతీరుతో అలరిస్తారని అభిప్రాయ పడ్డాడు. ఇక తర్వాత మ్యాచ్ ను సొంతగడ్డ హైదరాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం సన్ కు తప్పనిసరి. లేకపోతే, ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టంగా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.