IPL 2025 Kamindu Mendis Suprerb Bowling: ఐపీఎల్లో గురువారం మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అరంగేట్ర ఆట‌గాడు, క‌మిందు మెండిస్ జాదూ చేశాడు. శ్రీలంక‌కు చెందిన ఈ ఆల్ రౌండ‌ర్ కు విశేష ప్ర‌తిభ ఉంది. రెండుచేతుల‌తోనూ స్పిన్ వేయ‌గ‌ల నైపుణ్యం అత‌ని సొంతం. తాజాగా కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో త‌న మాయ‌జాలాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అలాగే ఒక్క ఓవ‌ర్ వేసి అంగ్ క్రిష్ ర‌ఘువంశీ వికెట్ ను కూడా సాధించాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్లో ఎప్ప‌టి నుంచో ఇలా రెండు చేతుల‌తో వేస్తున్న క‌మిందు.. ఐపీఎల్లో మాత్రం తొలిసారి త‌న ఘ‌న‌త‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఇక ఇన్నింగ్స్ 13వ‌ ఓవ‌ర్ వేసిన క‌మిందు.. లెఫ్ట్ హేండ్ బ్యాట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ కు కుడి చేతితోనూ, ర‌ఘువంశీకి ఎడ‌మ చేతితోనూ బౌలింగ్ చేసి సానుకూల ఫ‌లితాన్ని పొందాడు. ఇలా రెండు చేతుల‌తోనూ బౌలింగ్ చేయ‌డాన్ని అంబిడ‌క్ట్ర‌స్ బౌలింగ్ అని అంటారు. అయితే ఈమ్యాచ్ లో స‌న్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కేవ‌లం ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే క‌మిందుకు ఇవ్వ‌డం విశేషం. ఇక క‌మిందు రెండు చేతుల‌తోనూ బౌలింగ్ చేస్తున్న వీడియో తాజాగా వైర‌లైంది. ఇదేప్పుడు తాము చూడ‌లేద‌ని, కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు విప‌రీతంగా నెటిజ‌న్లు చేస్తున్నారు. 

బ్యాటింగ్ లోనూ స‌త్తా చాటిన క‌మిందు.. ఇక  ఈ మ్యాచ్ లో త‌న బ్యాటింగ్ ప్ర‌తిభ‌ను కూడా క‌మిందు చాటుకున్నాడు. మూడు వికెట్లు ప‌డ‌టంతోనే ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లోనే త‌ను బ్యాటింగ్ కు వ‌చ్చాడు. ఆ త‌ర్వాత తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి  (19)తో 35 పరుగుల మంచి భాగ‌స్వామ్యం ఏర్పాటు చేశాడు. ఇక కుదురుకున్నాక రెండు భారీ సిక్స‌ర్లు కూడా బాదాడు. మొత్తానికి 20 బంతుల్లో 27 ప‌రుగులు చేసిన క‌మిందు.. ఒక ఫోర్, రెండు సిక్స‌ర్లును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో త‌ను ఔట‌య్యాడు. ఆల్ రౌండ‌ర్ గా త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని అభిమానులు పేర్కొంటున్నారు. త‌న‌కు త‌ర‌చూ తుదిజ‌ట్టులో చోటు క‌ల్పించాల‌ని సూచిస్తున్నారు. 

స‌న్ రైజ‌ర్స్ హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు.. గ‌త సీజ‌న్ లో సంచ‌న‌ల బ్యాటింగ్ తో అల్లాడించిన స‌న్.. ఈ సీజ‌న్ లో చ‌తికిల ప‌డుతోంది. తాజాగా వ‌రుస‌గా మూడో మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ఓట‌మిపాలైంది. తొలుత బౌలింగ్ లో భారీ ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న స‌న్.. ఆ త‌ర్వాత బ్యాటింగ్ లోనూ తేలిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియ‌న్స్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో 80 ప‌రుగుల‌తో ఓటమి పాలైంది. గురువారం  జ‌రిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 200 ప‌రుగులు చేసింది. స్టార్ ఆల్ రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ (60)తో విధ్వంసం సృష్టించాడు. బౌల‌ర్లలో మ‌హ్మ‌ద్ ష‌మీ (1-29) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంత‌రం ఛేద‌న‌లో స‌న్ రైజ‌ర్స్ 16.4 ఓవ‌ర్ల‌లో 120 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన  వైభ‌వ్ అరోరా 3 టాప్ వికెట్లతో సత్తాచాటాడు., వరుణ్ చక్రవర్తి కూడా మూడు కీల‌క వికెట్ల‌తో ఆకట్టుకున్నారు. ఈ ఫ‌లితంలో హ్యాట్రిక్ ప‌రాజ‌యాల‌ను స‌న్ న‌మోదు చేసింది. పట్టికలో పదోస్థానానికి దిగజారింది. ఇక త‌మ త‌ర్వాతి మ్యాచ్ ను హైద‌రాబాద్ లో గుజ‌రాత్ టైటాన్స్ తో ఆదివారం (ఈనెల 6న‌) స‌న్ ఆడ‌బోతోంది.