IPL 2025 SRH Hatrick Losses : స‌న్ రైజ‌ర్స్ ఆట‌తీరు మార‌లేదు. వ‌రుస‌గా మూడో మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫ‌ల్యంతో ఓట‌మిపాలైంది. తొలుత బౌలింగ్ లో భారీ ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న స‌న్.. ఆ త‌ర్వాత బ్యాటింగ్ లోనూ తేలిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియ‌న్స్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో 80 ప‌రుగుల‌తో ఓటమి పాలైంది. గురువారం కోల్ క‌తాలోని  ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 200 ప‌రుగులు చేసింది. స్టార్ ఆల్ రౌండ‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ (60)తో విధ్వంసం సృష్టించాడు. బౌల‌ర్లలో మ‌హ్మ‌ద్ ష‌మీ (1-29) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంత‌రం ఛేద‌న‌లో స‌న్ రైజ‌ర్స్ 16.4 ఓవ‌ర్ల‌లో 120 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన  వైభ‌వ్ అరోరా 3 టాప్ వికెట్లతో సత్తాచాటాడు., వరుణ్ చక్రవర్తి కూడా మూడు కీల‌క వికెట్ల‌తో ఆకట్టుకున్నారు. ఈ ఫ‌లితంలో హ్యాట్రిక్ ప‌రాజ‌యాల‌ను స‌న్ న‌మోదు చేసింది. పట్టికలో పదోస్థానానికి దిగజారింది. 

వెంక‌టేశ్, రింకూ కీల‌క భాగ‌స్వామ్యం.. ఇక టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు శుభారంభం దక్కలేదు. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) త్వ‌ర‌గా ఔటయ్యారు. ఈ ద‌శ‌లో అజింక్య ర‌హానే కెప్టెన్ ఇన్నింగ్స్ (38)తో స‌త్తా చాట‌గా, అంగ‌క్రిష్ ర‌ఘువంశీ మెరుపు ఫిఫ్టీ (32 బంతుల్లో 50, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో స‌త్తా చాటాడు. వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్ ను నిల‌బెట్టారు. వీరిద్ద‌రూ వెనుదిరిగాకా వెంకటేశ్, రింకూ సింగ్ జోడీ కీలకదశలో చెలరేిగి జట్టును భారీ స్కోరు అందించింది. వీరిద్దరూ ఐదో వికెట్ కు 91 పరుగులు జోడించారు. చివరి నాలుగు ఓవర్లలో 78 పరుగులు సాధించడంతో విన్నింగ్ స్కోరును కేకేఆర్ సాధించగలిగింది. 

పవర్ ప్లేలో పానిక్..

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు శుభారంభం దక్కలేదు. తొలి బంతినే బౌండరీకి తరలించిన ట్రావిస్ హెడ్ (4) ఆ తర్వాత బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో రెండు పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో 9-3తో సన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన పేసర్ వైభవ్ అరోరా కీలకమైన హెడ్, ఇషాన్ వికెట్లను తీశాడు. ఆ తర్వాత నితీశ్ రెడ్డి (19) , కమిందు మెండిస్ (27)తో కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. అయితే శుభారంభం దక్కిన తర్వాత, చెత్త షాట్ తో నితీశ్ వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి కమిందు కూడా ఔటయ్యాడు. ఇక క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ ఉన్నంత సేపు సన్ గెలుపు గురించి ఆలోచన కలిగింది. అయితే రెండు సిక్సర్లు కొట్టి, ఆఖరికి తను కూడా వెనుదిరగడంతో సన్ కు ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్ లో భారీ పరాజయం పాలవడంతో పట్టికలో సన్.. పదో స్థానంలో సన్ నిలిచింది. వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.