IPL 2025 SRH Failed In Power Play Again: కథ మారలేదు.. తీరు మారలేదు.. మాజీ చాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో మ్యాచ్ లోనూ హోరీబుల్ గా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. కోల్ కతాలో గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా విధ్వంసక ప్లేయర్లు ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) త్వరగా ఔటయ్యారు. దీంతో 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఒక వైపు వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశాడు. నిజానికి శ్రీలంక బ్యాటర్ కమింద్ మెండిస్ క్యాచ్ ను కేకేఆర్ ఆల్ రౌండర్ రసెల్ అర్నాల్డ్ వదిలెయ్యడంతో మరో వికెట్ పడకుండా ఎస్ఆర్ హెచ్ బతికి పోయింది. లేకపోతే నాలుగు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడిపోయేదే.. సన్ రైజర్స్ ఓటమికి ఇదే మెయిన్ కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు.. టాపార్డర్ విఫలం కావడం జట్టు విజయవకాశాలను దెబ్బ తీస్తోంది.
సన్ రైజర్స్ ఎదురీత.. గత సీజన్లో అగ్రెసివ్ క్రికెట్ తో ఎంతో మంది అభిమానుల మనసు దోచిన ఎస్ఆర్ హెచ్ ఈసారి మాత్రం ఎదురీదుతోంది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ ల్లో ఒక్కదాంట్లో గెలిచి, 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. నిజానికి తన పేరుకు తగ్గట్లు రాజస్థాన్ రాయల్స్ పై మాత్రమే భారీస్కోరు సాధించింది. 286 పరుగులతో సెకండ్ ఐపీఎల్ హయ్యెస్ట్ స్కోరు సాధించింది. ఆ తర్వాత 300 పరుగుల మార్కును క్రాక్ చేస్తుందా అని ఆశగా ఎదురు చూశారు. అయితే అప్పటి నుంచి సీన్ మారింది. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై బ్యాటింగ్ వైఫల్యం కనీసం రెండు వందల స్కోరును దాటలేక పోయింది. తాజాగా కేకేఆర్ చేతిలో 80 పరుగులతో ఓడిపోయింది.
వెంకటేశ్ విధ్వంసం.. ఇక ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 200 పరుగులు చేసింది. విధ్వంసక్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 60, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) స్టన్నింగ్ ఫిఫ్టీతో అదరగొట్టాడు. గతేడాది మెగా వేలంలో రూ.23.75 కోట్లకు తనను కొనుగోలు చేసినందుకుగాను వెంకటేశ్.. కేకేఆర్ కు న్యాయం చేశాడు. ఒక దశలో 160 పరుగులు కూడా డౌట్ అన్న దశలో రింకూ సింగ్ (17 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్్)తో కలిసి వెంకటేశ్ భారీ స్కోరును జట్టుకు అందించారు. వీరిద్దరూ 41 బంతుల్లో 91 పరుగులు చకచకా చేయడంతో కేకేఆర్ 200 పరుగుల మార్కును క్రాస్ చేసింది. అనంతరం ఛేదనలో సన్ రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (33) టాప్ స్కోరర్. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లతో సన్ ను దెబ్బ తీశారు.