ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ కథ ముగిసింది. అసలు లీగ్ దశలోనే కథ ముగిసింది అనుకున్నారు అంతా కానీ ఎవరూ ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చి ఈ దశ వరకు వచ్చిందా జట్టు. మరి ఇందులో పోటుగాళ్లు ఎవరు... ఆటగాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 


పోటుగాడు కోహ్లీ 


టీం టాపర్‌ ఎప్పటి మాదిరిగానే కోహ్లీ ఉంటాడు. టీం టాపరే కాదు ఐపీఎల్‌ 2024 టాపర్‌గా నిలిచాడు. పదేహేను ఇన్నింగ్స్‌లలో 741 పరుగులు చేసి ఎవరూ చేరుకోలేని ఎత్తున కూర్చున్నాడు. యావరేజ్‌ 61.75 ఉంటే... స్ట్రైక్ రేట్‌ 154.69గా ఉంది. 


కెప్టెన్‌గా డూప్లిసిస్‌ సూపర్  


ఆర్సీబీలో చెప్పుకోదగ్గట్టు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న ప్లేయర్‌ డూప్లిసిస్‌. కెప్టెన్‌గా జట్టును ప్లే ఆఫ్ వరకు తీసుకొచ్చిన విధానం అమేజింగ్ అనే చెప్పాలి. అసలు ప్లే ఆఫ్‌కు రావడమే కష్టం అనుకున్న టైంలో అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో ఈ స్టేజ్ వరకు జట్టును తీసుకొచ్చాడు. బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించాడు. 15 మ్యాచ్‌లలో 29.20 యావరేజ్‌తో 438 పరుగులు చేశాడు.


అమేజింగ్ ప్లేయర్‌ రజత్‌ పటిదార్‌


తర్వాత స్థానంలో ఉండే ప్లేయర్ రజత్‌ పటిదార్‌. 177కుపైగా స్ట్రైక్ రేట్‌తో మిడిల్ ఓవర్లలో బౌలర్లకు సంహస్వప్నంలా మారాడు. ముఖ్యంగా స్పినర్లపై పటిదార్ విరుచుకుపడే విధానం ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. పటిదార్‌ స్థిరమైన బ్యాటింగ్ ఆర్సీబీని ప్లే ఆఫ్ వరకు తీసుకొచ్చిందనే చెప్పాలి. 


విరుచుకు పడ్డ విల్ జాక్స్ 


ఇలా అదిరిపోయే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న మరో ఆటగాడు విల్ జాక్స్. ఆడింది ఎనిమిది ఇన్నింగ్సే అయినా 230 పరుగులు చేశాడు. వాటిలో గుజరాత్ టైటాన్స్‌పై చేసిన సెంచరీ అతనికి ప్రత్యేకమని చెప్పవచ్చు. 


ఆఖరిదైనా అదరగొట్టిన డీకే 


తన ఆఖరి ఐపీఎల్ ఆడిన దినేష్ కార్తీక్‌కు ఈ సీజన్ గొప్ప మెమొరబుల్ సీజన్. బ్యాటింగ్, కీపింగ్‌లో అద్భుతాలు చేశాడు డీకే. 15 ఇన్నింగ్స్ ఆడిన దినేష్‌... 326 పరుగులు చేశాడు. ఈయన స్ట్రైక్ రేటు 187పైగానే ఉంది. ఆఖరి ఇన్నింగ్స్‌లో వివాదాస్పదమైన ఎల్బీడబ్ల్యూతో నిరాశగా ఆటకు ముగింపు పలకాల్సి వచ్చింది. 


టెయిల్ ఎండర్స్‌లో టాపర్‌ మహిపాల్ 


ఆఖరి ఓవర్లలో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసి ఆర్సీబీకి గౌరప్రదమైన స్కోర్‌ చేసేలా ఆడిన వారిలో మహిపాల్ లోమ్రోర్ ఒకరు. 


నిరాశ పరిచిన కెమరాన్‌ గ్రీన్‌


కెమరాన్‌ గ్రీన్‌ చెప్పుకోదగ్గ ఆటతో ఆకట్టుకోలేకపోయాడు. 13 మ్యాచ్‌లు ఆడిన గ్రీన్ కేవలం 10 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. పరుగులు ధారళంగా ఇచ్చేశాడు. 
గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు మాత్రం ఈ సీజన్‌ ఎప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది. అంత పేలవమైన ఆట తీరును ప్రదర్శించాడు. పది ఇన్నింగ్స్ ఆడిన ఇతను కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లో కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చూపలేదు. ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఇలా ఏ రంగంలో చూసిన మాక్స్‌ వెల్‌ కు ఇది పూర్‌ ఫెర్మార్మెన్స్‌ సీజన్‌గానే చెప్పవచ్చు. రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేషన్ మ్యాచ్‌లో కూడా పేలవమైన షాట్‌కు ప్రయత్నించి విమర్శలు పాలు అయ్యాడు. 


స్వప్నిల్ సింగ్ సూపర్ 


ఐపీఎల్‌ 2024లో ఆర్సీలో మెరిసిన మరో వీరుడు స్వప్నిల్ సింగ్. ఆడింది ఆరు ఇన్నింగ్సే అయినా గుర్తుండిపోయే ఆటను ఆడాడు. ఆరు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. 


వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయిన వారిలో మయాంక్ దాగర్‌ ఒకరు. షబాజ్‌ అహ్మద్‌ వెళ్లిపోవడంతో అవకాశం దక్కించుకున్న మయాంక్‌ పేలవమైన ఆట తీరుతో మరో ఛాన్స్ రాబట్టుకోలేకపోయారు. ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 
కరణ్ శర్మ తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. మొదట్లో బెంచ్‌కే పరిమితమైన ఈ బౌలర్‌ తర్వాత తనకు వచ్చిన ఛాన్స్‌లను సద్వినియోగం చేసుకున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఏడు వికెట్లు తీసుకున్నాడు. 


ప్చ్‌ సిరాజ్ 


మహమ్మద్‌ సిరాజ్‌కి కూడా ఈ సీజన్ కలిసిరాలేదు. 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీసుకున్నప్పటికీ తన ప్రతిభకు తగ్గ ప్రదర్శన చేయలేదని విశ్లేషకుల మాట. 
యశ్‌ దయాల్‌... 2023లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసి విమర్శలు పాలైనప్పటికీ ఆర్సీబీ ఈయనపై నమ్మకం ఉంచింది. 2024 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ ఆడిన దయాల్‌ 15 వికెట్లు తీసుకున్నాడు. 


ఫెర్గుసన్‌ కూడా తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తక్కువ ప్రైస్‌కే ఆర్సీబీకి దక్కిన ఈ బౌలర్‌ 7 మ్యాచ్‌లు ఆడి 9వికెట్లు తీశాడు. 
భారీ ధర చెల్లించి ఫెయిల్ అయిన ఆటగాళ్లలో అల్జారీ జోసెఫ్‌ ఒకడు. 11.50 కోట్లకు కొనుకున్న ఈ ఆర్సీబీ ఆటగాడు... అదే ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేశాడు. మూడు ఇన్నింగ్స్ ఆడిన 1 వికెట్ తీసుకున్నాడు. అతని బౌలింగ్ ఎకానమీ 11.89గా ఉంది.