RCB fans brutally trolled | అహ్మదాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మరోసారి హిస్టరీ రిపీట్ అయింది. అదేనండీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పోరాటం బుధవారం రాత్రి ముగిసింది. గత 16 సీజన్లలో ఈ సాలా కప్ నమదే (Ee Sala Cup Namde) అని ఆర్సీబీ చెబుతూనే ఉంది. తాజాగా 2024లో అంటే ఐపీఎల్ సీజన్ 17లో కప్ కొట్టాలని ఆర్సీబీ భావించినా నిరాశే ఎదురైంది. మే 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి చెంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రాజస్థాన్ మరో 6 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. 






ఐపీఎల్ 2024లో తొలి 8 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ నెగ్గిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్లదనుకుంటే వరుసగా 6 విజయాలు సాధించింది. కానీ ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చిన ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి ఇంటిదారి పట్టడంతో ఆ జట్టుపై ట్రోల్స్, ఫన్నీ మీమ్స్ (RCB Funny Memes) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచించి ఎలిమినేటర్ లో ఓడిపోయి టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వడానికా అంటూ ఆర్సీబీని ట్రోల్ (RCB Trolls) చేస్తున్నారు.


మీరు ఇంతవరకు రావడమే గొప్ప అంటూ పోస్టులతో ఆర్సీబీ జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా మనకు ఎందుకురా ట్రోఫీలు, కప్పులు అంటూ తమ్ముడు సినిమాలోని డైలాగ్స్ తో ఫన్నీ వీడియోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.






అన్నింటికి మించి దారుణం ఏంటంటే..
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై గెలిచిన రాజస్థాన్ సైతం తన ప్రత్యర్థిని ట్రోల్ చేసింది. వరుస విజయాలు సాధించి వచ్చిన ఆర్సీబీని తొక్కి పాడేశామని చెప్పేలా రాజస్థా్న్ ఫ్రాంచైజీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ అయింది.  


ఆర్సీబీ లీగ్ స్టేజ్ చివరి 6 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్, డీసీ, పంజాబ్.. ఇలా అందర్నీ చెందెబ్బ కొడితే మేం ఆర్సీబీని దెబ్బ కొట్టామని మరో పోస్ట్ చేసింది రాజస్థాన్. ఆర్సీబీ, ఇతర జట్ల ఫ్యాన్స్, నెటిజన్లు చేసిన ట్రోలింగ్ కంటే ప్రత్యర్థి రాజస్థాన్ టీమ్ చేసిన ట్రోల్స్, ఫన్నీ మీమ్స్ ఆర్సీబీని మరింత బాధించవచ్చు.






డబ్ల్యూపీఎల్ ప్రారంభమైన తక్కువ సీజన్లకే ఆర్సీబీ మహిళల జట్టు WPL ట్రోఫీని ముద్దాడింది. కానీ 17 ఏళ్లుగా పోరాడుతున్నా ఒక్క ట్రోఫీ నెగ్గని జట్టు అంటూ ఆర్సీబీని ఏకిపారేస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం సహనం కోల్పోయి ఆటగాళ్లపై జోక్స్ పేల్చుతున్నారు. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదని కామెంట్ చేస్తున్నారు.






ఆర్సీబీ, రాజస్థాన్ మ్యాచ్‌లో బెంగళూరు ఫ్యాన్స్ పరిస్థితి ఇలా ఉందని ఏడుస్తున్న వీడియోలు పోస్ట్ చేశారు. దాంతో ఆర్సీబీకి మరోసారి భంగపాటు తప్పలేదని, అగ్రెసివ్ గా ఉంటే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గరని.. ప్లే ఆఫ్స్ వెళితే ఎవరూ కప్ ఇవ్వరని.. ఫైనల్ చేరుకుని అక్కడ నెగ్గితేనే ట్రోఫీ దొరుకుతుందంటూ విరాట్ కోహ్లీని ట్రోల్ చేశారు. 






6 వరుస మ్యాచ్‌లలో నెగ్గిన ఆర్సీబీ 7వ మ్యాచ్‌లో ఓడిపోయింది. తలా ఫర్ ఏ రీజన్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. 






ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యామని రోడ్ల మీద సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు ఉన్నాయి, కప్ ఇచ్చేస్తారా అంటూ ఆర్సీబీ టీమ్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. జట్టు కోసం ఎంతగానో పోరాడిన కోహ్లీ ఈ సీజన్‌లోనూ ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 7 వేల పరుగుల క్లబ్‌‌లో మరో ఆటగాడు లేడంటేనే కోహ్లీ జట్టు కోసం ఏ మేరకు ప్రయత్నిస్తాడో అర్థం చేసుకోవచ్చు.






ఆర్సీబీ మహిళల జట్టు నెగ్గిన కప్ మాకు చాలంటూ మరో ఫన్నీ మీమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.