Dinesh Karthik IPL Retirement : వెటరన్ బ్యాటర్, వికెట్  కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌(Dinesh Karthik) ఐపీఎల్‌ (IPL) కెరియర్ కు వీడ్కోలు పలికాడు. తన జట్టు  బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌(RR) చేతిలో ఓటమి పాలై  టోర్నీ నుంచి నిష్క్రమించే వేళ అకస్మాత్తుగా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని చెప్పేశాడు. చేతి గ్లౌస్‌లు తీసి అభిమానులకు అభివాదం చేశాడు. దీంతో అతను అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ అది రిటైర్మెంట్ ప్రకటనగానే తెలుస్తోంది. 






173 పరుగుల ఛేజింగ్‌లో రాజస్థాన్‌కు రోవ్‌మన్ పావెల్ విజయాన్ని అందించిన తరువాత  ఒక్కో ఆటగాడు తోటి ఆటగాడికి అభివాదం చేసే సమయంలో  38 ఏళ్ల దినేష్ కార్తీక్  చేసిన పని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ  వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది.  కార్తీక్  గ్లౌస్లు తీసి అభిమానులకు అభివాదం చేయగానే నరేంద్ర  మోడీ స్టేడియంలో స్టాండ్‌లో ఉన్న RCB సహచరులు, అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ అభినందించారు. మైదానాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రేక్షకులు 'DK, DK' అని నినాదాలు చేశారు. దీంతో ఇది రిటైర్మెంట్ ప్రకటనే అన్న అనుమానం అభిమానులకు కూడా కలిగింది. 






ఈ ఐపిఎల్ సీజన్లో కార్తీక 15 మ్యాచ్ లు ఆడి 36.22 సగటుతో  326 పరుగులు చేశాడు.. డెత్ ఓవ‌ర్లలో అత్య‌ధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడిగా కూల్ ఫినిషర్ పాత్రను పోషించాడు. కార్తీక్ ఈ ఐపిఎల్ లో తన సత్తా చూపి మరోసారి తనపేరు T20 ప్రపంచ కప్ టీంలో చోటు దక్కుతుందేమో అనేంతగా అదరగొట్టాడు. జూనియర్ల వల్ల T20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కకపోవచ్చు గానీ  అవసరానికి అనుగుణంగా తన ఆటను మార్చుకొనేలా తనను తాను మలచుకున్నాడు దినేష్ కార్తీక్. 


డీకే ఐపిఎల్ ప్రయాణం సాగిందిలా..  


2008 నుంచి దినేష్  ఐపిఎల్ లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 17 సీజన్లలో 257 మ్యాచ్‌లు ఆడిన డీకే  4842 పరుగులు చేశాడు. తన IPL కెరీర్‌లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తన ఐపిఎల్ ప్రయాణం ప్రారంభించాడు. 2011లో పంజాబ్‌కు  2014లో తిరిగి ఢిల్లీకి. మధ్యలో  ముంబైతో ఉన్నాడు.  RCB అతన్ని 2015లో సొంతం చేసుకుంది. 2016, 2017లో గుజరాత్ లయన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత మళ్ళీ కార్తీక్ 2022లో RCBకి తిరిగి వచ్చాడు. 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వెళ్లినప్పటి నుంచి అతను టాప్ ఫినిషర్ గా పేరు పొందాడు. ఈ సీజన్లో కూడా అది మరోసారి నిరూపించుకున్నాడు. 


అయితే దినేష్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పాడా లేదా అన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. డీకే కొంతకాలం కామెంటేటర్ గా కూడా ఉన్నాడు కాబట్టీ ఇకవేళ ఇది రిటైర్మెంట్ ప్రకటనే అయితే తరువాత రాబోయే ఐపిఎల్ సీజన్లలో వ్యాఖ్యతగా కనపడే అవకాశం ఉంది. అన్నట్టు దినేష్ కార్తీక్ కు మన తెలుగు మూలాలు ఉన్నాయి. డీకే  తల్లి పద్మినీ కృష్ణ కుమారి తెలుగువారే అయినప్పటికీ కుటుంబంతో తమిళనాడులో స్థిరపడ్డారు.