Suryakumar Yadav To Miss First Two Games Of IPL 2024: ఐపీఎల్‌(IPL) ప్రారంభానికి ముంబై ఇండియన్స్‌(MI)కు గట్టి షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది.  టీమిండియా  స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్యా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోలేదని... అతను ఐపీఎల్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. 24 న గుజరాత్ టైటాన్స్ తో తొలి మ్యాచ్, 27 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో రెండో మ్యాచ్ కు సూర్య బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ రెండు మ్యాచ్ ల తర్వాత సూర్య పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే ఐపీఎల్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ తర్వాత జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకొని సూర్యకు విశ్రాంతి ఇవ్వాలని కూడా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే. ఐపీఎల్ లో సూర్య కుమార్ యాదవ్ కు తిరుగులేని రికార్డ్ ఉంది. 139 మ్యాచ్ ల్లో 3000 లకు పైగా పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 


షమీ కూడా అవుట్‌
  టీమిండియా(Team India)ను గాయాలు వేధిస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు వరుసగా గాయాల బారిన పడుతుండడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. ఓ వైపు ఐపీఎల్‌(IPL) ప్రారంభం అవుతుండడం... అది ముగియగానే టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) ఆరంభం కానున్న వేళ... ఎవరు జట్టులో ఉంటారో... ఎవరో దూరమవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ 20 ప్రపంచ కప్‌నకు మ‌హ్మద్ ష‌మీ దూరం కానున్నాడ‌ని, అదే స‌మ‌యంలో రిష‌బ్ పంత్ ఈ మెగా టోర్నీలో ఆడే అవ‌కాశాలు ఉన్నట్లు జై షా తెలిపాడు. చీల‌మండ గాయంతో బాధ‌ప‌డుతున్న ష‌మీ ఇటీవ‌ల లండ‌న్‌లో శ‌స్త్రచికిత్స చేయించుకున్నాడని... అతను సెప్టెంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జై షా తెలిపారు. రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ ఆడ‌నున్నట్లు జైషా తెలిపారు. పంత్ మునప‌టిలా బ్యాటింగ్ చేస్తున్నాడ‌ని, త్వర‌లోనే అత‌డికి ఎన్ఓసీ ఇవ్వనున్నట్లు చెప్పారు. టీ20 ప్రపంచ‌ క‌ప్ ఆడాల‌ని అనుకుంటే పంత్‌  పేరును ఖ‌చ్చితంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని జై షా వెల్లడించాడు. తొడ కండ‌రాల గాయం బారినపడ్డ కేఎల్ రాహుల్.. నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో కోలుకుంటున్నాడని జై షా వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభం నాటికి అత‌డు ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశం ఉంద‌ని జైషా అన్నారు.