Rishabh Pant will be declared fit soon:  టీమిండియా(Team India)ను గాయాలు వేధిస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు వరుసగా గాయాల బారిన పడుతుండడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. ఓ వైపు ఐపీఎల్‌(IPL) ప్రారంభం అవుతుండడం... అది ముగియగానే టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) ఆరంభం కానున్న వేళ... ఎవరు జట్టులో ఉంటారో... ఎవరో దూరమవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ 20 ప్రపంచ కప్‌నకు మ‌హ్మద్ ష‌మీ దూరం కానున్నాడ‌ని, అదే స‌మ‌యంలో రిష‌బ్ పంత్ ఈ మెగా టోర్నీలో ఆడే అవ‌కాశాలు ఉన్నట్లు జై షా తెలిపాడు. చీల‌మండ గాయంతో బాధ‌ప‌డుతున్న ష‌మీ ఇటీవ‌ల లండ‌న్‌లో శ‌స్త్రచికిత్స చేయించుకున్నాడని... అతను సెప్టెంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జై షా తెలిపారు. రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ ఆడ‌నున్నట్లు జైషా తెలిపారు. పంత్ మునప‌టిలా బ్యాటింగ్ చేస్తున్నాడ‌ని, త్వర‌లోనే అత‌డికి ఎన్ఓసీ ఇవ్వనున్నట్లు చెప్పారు. టీ20 ప్రపంచ‌ క‌ప్ ఆడాల‌ని అనుకుంటే పంత్‌  పేరును ఖ‌చ్చితంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని జై షా వెల్లడించాడు. తొడ కండ‌రాల గాయం బారినపడ్డ కేఎల్ రాహుల్.. నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో కోలుకుంటున్నాడని జై షా వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభం నాటికి అత‌డు ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశం ఉంద‌ని జైషా అన్నారు. 



 
బీసీసీఐ నజరాన
టెస్టు క్రికెట్‌ను ఎక్కువ మంది క్రికెటర్లు ఆడేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఒక సీజన్‌లో కనీసం 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడితే  30 లక్షల నుంచి 45 లక్షలు అదనంగా చెల్లిస్తామని జై షా ప్రకటించారు. రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు ఇందులో సగం ఇస్తామని ప్రకటించారు. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి... ఆటగాళ్లను ప్రోత్సహించడానికి.. ఈ అద్భుత స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది.  కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ను కాదని ఐపీఎల్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 
నాలుగు గ్రేడ్‌లు
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు గ్రేడ్స్‌ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు యేటా రూ. 7 కోట్లు... ఏ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతోంది. సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు అందుతున్నాయి. టెస్టు మ్యాచ్‌లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు దక్కుతాయి.