టీమిండియా (Team India)అభిమానులకు శుభవార్త అందింది. రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్(Rishabh Pant) పూర్తిగా కోలుకున్నాడు. ఏడాది పాటు ఆటకు దూరమైన పంత్‌... ఐపీఎల్‌లో ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అనుమానాలు పటాపంచలు అయిపోయాయి. ఇప్పటికే పంత్‌ నెట్స్‌లో పూర్తి స్థాయి ప్రాక్టీస్ ప్రారంభించాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్, ఫీల్డింగ్ సాధన మొదలు పెట్టాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు. పంత్‌ పూర్తిగా కోలుకున్నాడని.. అతను ఐపీఎల్‌లో దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ వెల్లడించింది. ఈ ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆనందం వ్యక్తం చేసింది. రిషభ్ పంత్ కోలుకోవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

టీ 20 ప్రపంచకప్‌లోనూ....

టీమిండియా(Team India)ను గాయాలు వేధిస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు వరుసగా గాయాల బారిన పడుతుండడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. ఓ వైపు ఐపీఎల్‌(IPL) ప్రారంభం అవుతుండడం... అది ముగియగానే టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) ఆరంభం కానున్న వేళ... ఎవరు జట్టులో ఉంటారో... ఎవరో దూరమవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ 20 ప్రపంచ కప్‌నకు మ‌హ్మద్ ష‌మీ దూరం కానున్నాడ‌ని, అదే స‌మ‌యంలో రిష‌బ్ పంత్ ఈ మెగా టోర్నీలో ఆడుతాడని జై షా తెలిపాడు. రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ ఆడ‌నున్నట్లు జైషా తెలిపారు. పంత్ మునప‌టిలా బ్యాటింగ్ చేస్తున్నాడ‌ని, త్వర‌లోనే అత‌డికి ఎన్ఓసీ ఇవ్వనున్నట్లు చెప్పారు. జై షా ఈ ప్రకటన చేసిన గంటల్లోనే పంత్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచ‌ క‌ప్ ఆడాల‌ని అనుకుంటే పంత్‌ పేరును ఖ‌చ్చితంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని జై షా వెల్లడించాడు. తొడ కండ‌రాల గాయం బారినపడ్డ కేఎల్ రాహుల్.. నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో కోలుకుంటున్నాడని జై షా వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభం నాటికి అత‌డు ఫిట్‌నెస్ సాధించే అవ‌కాశం ఉంద‌ని జైషా అన్నారు.

 

ఏ బాధ్యతలు అప్పగిస్తారో...

పంత్‌ ఈ ఐపీఎల్‌లో ఆడడం ఖాయమని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌( Ricky Ponting) స్పష్టం చేశాడు. రికీ పాంటింగ్‌ ప్రకటనతో ఢిల్లీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ పూర్తిగా ఆడనున్నాడని... అయితే బ్యాటర్‌గానా.. వికెట్‌కీపర్‌ బాధ్యతలు కూడా చేపడతాడా అన్నది ఇంకా తెలియదని పాంటింగ్‌ చెప్పాడు. పంత్‌ పూర్తి ఐపీఎల్‌ ఆడటంపై విశ్వాసంగా ఉన్నాడని.. అతడి బాధ్యతలపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాంటింగ్‌ తెలిపాడు. పంత్‌ ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రాక్టీస్‌ ఆరంభించాడు. ఐపీఎల్‌ ఆరంభానికి ఇంకా ఆరు వారాలు మాత్రమే సమయం ఉందని.. పంత్‌ వికెట్‌కీపింగ్‌ చేస్తాడా అన్నది చెప్పలేమని పాంటింగ్‌ స్పష్టం చేశాడు. ఈ ఐపీఎల్‌లో అతడిని బ్యాటర్‌గానైతే చూడొచ్చని కూడా చెప్పాడు. అన్ని మ్యాచ్‌ల్లో ఆడించడంపైనా నిర్ణయం తీసుకోలేదని.... లీగ్‌ దశలో 14లో 10 మ్యాచ్‌ల్లో ఆడినా తమకు బోనసే అని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ తెలిపాడు. పంత్‌ను అడిగితే మాత్రం ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడతాను.. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌ కూడా చేస్తానంటాడని పాంటింగ్‌ తెలిపాడు.

 

ఆ ప్రమాదంతో....

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఏడాది క్రితం డిసెంబర్‌ 30న పంత్‌కు యాక్సిడెంట్‌ అయింది. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి.