SRH vs KKR : అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నీ కథ మొదలైందో తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటుంది నాయనా అని బ్రహ్మానందానికి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఈ సీజన్‌లో SRH, KKR రైవల్రీ తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్ మ్యాచ్‌తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌ను సన్ రైజర్స్ 4పరుగుల తేడాతో కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో ఛేజింగ్‌లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ ఓడినా ఈసారి సన్ రైజర్స్ ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైయర్ 1లోనే. క్వాలిఫైయర్ 1లో మళ్లీ సన్ రైజర్స్‌పై కంప్లీట్ డామినెన్స్ చూపించిన కోల్‌కతా ఈసారి ఏకంగా 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కి చేరుకుంది. క్వాలిఫైయర్ 1 ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విక్టరీ కొట్టడం ద్వారా ఇప్పుడు ఫైనల్‌లో మళ్లీ కోల్‌కతాతో తలపడనుంది.
మరి ఈసారి ఏం చేస్తాడు మీ హీరో అని కేజీఎఫ్‌లో పెద్దావిడ అడిగినట్లు మరి ఇప్పుడు SRH ఏం చేస్తుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా చేతిలో ఎదురైన రెండు పరాభావాలకు సమాధానం ఫైనల్‌లో ఇచ్చి KKRకు ఊహించ లేని షాక్ ఇస్తుందా... లేదా ఫైనల్లోనూ కోల్‌కతాకు తలవంచి ఏం ఉందిలే ఇంక పడుకోండి అని ఫ్యాన్స్‌కి ఆరెంజ్ జ్యూస్ ఇస్తుందా తెలియాలంటే మే26వ తేదీన ఇదే చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఐపీఎల్ ఫైనల్లో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించారా.?
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్ వల్ల టీమిండియాకు ఒరిగే ప్రయోజనం ఏం ఉండదు. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్‌ను వరల్డ్ కప్‌కి ముందు ప్రాక్టీస్‌గా మార్చుకోవటానికి టీ20 వరల్డ్ కప్‌లో ఆడే ఏ ఇండియన్ ప్లేయరూ ఈ రెండు టీమ్స్‌లో లేరు. టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసిన భారత జట్టులో ఈ రెండు టీమ్స్ నుంచి మాత్రమే ప్లేయర్లు లేరు. ఇప్పుడు ఆ రెండు టీమ్సే ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్నాయి.
ఈ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ తరపున అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ లాంటి యంగ్ స్టర్స్ మంచి ప్రదర్శనే ఇచ్చినా వారు ఇంకా యంగ్ స్టర్స్ కావటం, ప్లేస్మెంట్స్ సమస్య, పైగా వాళ్లు కూడా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉండటంతో సెలెక్షన్‌లో పరిగణలోకి తీసుకోలేదు. మరో టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి ఇదే జరిగింది. శ్రేయస్ అయ్యర్ సెలక్షన్‌లో ఉంటాడని అందరూ భావించినా అంతకు ముందు టీమిండియా ఆడిన ఇంగ్లండ్ సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగటం..సెలెక్షన్స్‌లో ఉండాలంటే రంజీ ఆడాలని బీసీసీఐ సూచించినా అయ్యర్ లైట్ తీసుకున్నాడు. దీంతో బీసీసీఐ అయ్యర్ పై క్రమశిక్షణా చర్యల కింద కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది. ఫలితంగా టీ20 వరల్డ్ కప్ టీమ్స్ ప్రాబబుల్స్ లోనూ అయ్యర్ చోటు దక్కలేదు. రింకూ సింగ్ టీ20 వరల్డ్ కప్‌లో ఉన్నప్పటికీ అతడు కేవలం ట్రావెలింగ్ రిజర్వ్‌గా టీమ్‌తో పాటు ఉంటాడు తప్ప మ్యాచ్‌లు ఆడడు.
ఈ ఐపీఎల్‌లో ఫైనల్ ప్యాట్ కమిన్స్, స్టార్క్, హెడ్ లాంటి ఆస్ట్రేలియన్లకు క్లాసెన్, మార్ క్రమ్ లాంటి సౌతాఫ్రికా ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది తప్ప టీమిండియాకు టీ20 వరల్డ్ కప్‌కు ఒరిగేది మాత్రం సున్నా.