IPL 2024: ఐపీఎల్‌లో ఫైనల్ ఆడాలంటే..తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్‌లో చెలరేగిపోయింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన రాజస్థాన్ టీమ్‌లో పేసర్లు హైదరాబాద్ బ్యాటర్లను ఇబ్బంది పెడితే..ఇన్నింగ్స్ మారేసరికి పిచ్ కథ మారిపోయింది. పూర్తిగా స్పిన్నర్లకు టర్న్ అవుతున్న పిచ్‌లో SRH స్పిన్నర్లు చెలరేగిపోయారు. 



ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ తోడుగా అభిషేక్ శర్మ జత కలవటంతో రాజస్థాన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. 176పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పింక్ పాంథర్స్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని 139పరుగులకే పరిమితమైపోయారు. స్పిన్నర్లు ఎంటర్ అయ్యే వరకూ స్వేచ్ఛగా ఆడేసిన యశస్వి జైశ్వాల్‌ను షాబాజ్ అహ్మద్ దొరకబుచ్చుకోవటంతో మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత ఆగలేదు. జైశ్వాల్‌తో పాటు రియాన్ పరాగ్, రవి చంద్ర అశ్విన్ వికెట్లను షాబాజ్ అహ్మదే తీసుకున్నాడు. 






బ్యాటింగ్‌లో విఫలమైనా ఈసారి బౌలింగ్‌లో అండగా నిలబడి అచ్చం యువీని గుర్తు తెచ్చాడు అభిషేక్ శర్మ. కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ తీయటంతోపాటు ప్రమాదకర ఆటగాడు షిమ్రోన్ హెట్మెయర్‌ను బౌల్డ్ చేయటం ద్వారా మ్యాచ్‌ను హైదరాబాద్ చేతుల్లోకి తీసుకువచ్చేశాడు. ఇక ఫైనల్లో కోల్‌కతా మీద ఇదే చెన్నై చెపాక్‌లో తుదిపోరుకు సిద్ధం కానుంది సన్ రైజర్స్ హైదరాబాద్.



క్రికెట్ అంటేనే అంత ఫుల్ ఎమోషన్స్ 
టార్గెట్ 300 అన్నట్లు బరిలోకి దిగిన సన్ రైజర్స్ 175పరుగులే చేసినప్పుడు సన్ రైజర్స్ ఫ్యాన్స్ డల్ అయిపోయారు. రాజస్థాన్ రాయల్స్ మీద ఈ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోగలమా అనే సందేహమే అందరిలోనూ ఎందుకంటే రాజస్థాన్‌కు బలమైన లైనప్ ఉంది. సూపర్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా అందరూ నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించిన వాళ్లే. అయితే ఆరెంజ్ ఆర్మీ టెన్షన్‌ను తీర్చేలా హైదరాబాద్ స్పిన్నర్లు RRను ఉచ్చులో బిగించేశారు. షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ పోటీ పడి మరీ వికెట్లు తీయటంతో ఈజీగా ఛేజ్ చేసేస్తుంది అనిపించిన రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా కుప్పకూలి 139పరుగులే చేయగలిగింది. 



ఆ టైమ్‌లో రెండు వైపులా రెండు ఎమోషన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ ఫుల్ ఎంజాయ్ చేశారు విక్టరీని. అప్పటి వరకూ పడిన టెన్షన్‌ని వదిలేసి నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ తన తండ్రి కళానిధి మారన్‌ను హగ్ చేసుకుంటూ రకరకాల ఎమోషన్స్‌ను చూపించారు. మరోవైపు రాజస్థాన గెలుస్తుందని బలంగా నమ్మిందేమో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది ఓ చిన్నారి. ఫైనల్ ఓవర్ అంతా ఏడుస్తూనే కనిపించింది. మ్యాచ్ అంటేనే అంతగా ఓ టీమ్‌కి సెలబ్రేషన్ మరో టీమ్‌కి మర్చిపోలేని ఎమోషన్. మొత్తంగా ఫైనల్‌కి ముందు జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్ ఇన్ని ఎమోషన్స్ బయటపడేలా చేసిందన్నమాట.