Aiden Markram SRH: ఐపీఎల్ 2023 సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు అయిడెన్ మార్ క్రమ్ ఎస్ ఆర్ హెచ్ ను నడిపించనున్నాడు. 28 ఏళ్ల మార్ క్రమ్ సౌతాఫ్రికా జట్టులో కీలక ఆటగాడు. ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా లీగ్ ఎస్ ఏ 20 లీగ్ లో తన జట్టు సన్ రైజర్స్ ఈస్టర్న్ కు కప్ ను అందించాడు. అయితే ఇప్పుడు అతిపెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు.
మార్ క్రమ్ గత రెండు సీజన్లుగా సన్ రైజర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. గతేడాది అతను స్థిరంగా రాణించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ విఫలమైన వేళ జట్టును తన బ్యాటింగ్ తో ముందుండి నడిపించాడు. అలాగే సన్ రైజర్స్ ఈస్టర్న్ తరఫున కెప్టెన్ గా, ఆటగాడిగా సత్తా చాటాడు. ఈ లీగ్ లో 12 మ్యాచ్ లు ఆడిన మార్ క్రమ్ బ్యాటింగ్ లో ఒక సెంచరీ సహా 366 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ లో 11 వికెట్లు తీశాడు.
అభిమానులను సంతృప్తి పరిచేలా ఆడతాం
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఎన్నికైన అనంతరం మార్ క్రమ్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ కొత్త బాధ్యత నాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఎల్లప్పుడూ గెలవాలనే కోరుకుంటాను. కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది.' అని మార్ క్రమ్ అన్నాడు. నాయకుడిగా జట్టు ఎప్పుడూ మెరుగ్గా ఉండాలని కోరుకుంటానని, అభిమానులను సంతృప్తి పరచాలని కోరుకుంటానని ఈ సౌతాఫ్రికా స్టార్ అన్నాడు. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో తన సహచరుడైన ఫాఫ్ డుప్లెసిస్, సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు.
'జాతీయ జట్టులో ఉన్నప్పుడు నేను డుప్లెసిస్ తో కొంత సమయం గడిపాను. అతని కెప్టెన్సీ విషయాలను దగ్గరుండి పరిశీలించాను. ఎప్పుడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే అవగాహన నాకుంది. అలాగే సన్ రైజర్స్ జట్టులో కేన్ తో గడిపాను. అతను చాలా కామ్ అండ్ కూల్ పర్సన్. ఫాఫ్, కేన్ ఇద్దరి ఆలోచనలు కొంచెం ఒకేలా ఉంటాయి. వీరిద్దరూ ఆటగాళ్లకు మద్దతు ఇస్తారు. వారిపై నమ్మకం ఉంచుతారు. నేను నిజంగా వీరినుంచి చాలా నేర్చుకున్నాను' అని మార్ క్రమ్ తెలిపాడు.
లారాతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాను
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు అయిడెన్ మార్ క్రమ్ తెలిపాడు. కొద్ది వారాల్లో వెస్టిండీస్ జట్టు 2 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనుంది. జట్టుతో పాటు లారా వెళ్లనున్నాడు. అప్పుడు లారాతో సమావేశమవుతానని చెప్పాడు. ఇద్దరం కలిసి ఎస్ ఆర్ హెచ్ కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని అన్నాడు. తామిద్దరం కలిసి ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తామని స్పష్టంచేశాడు.