IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఐపీఎల్ 2023 సీజన్ కు దూరమయ్యాడు. పంత్ గైర్హాజరీలో ఆసీస్ సీనియర్ బ్యాటర్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం.
వచ్చే సీజన్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు డేవిడ్ వార్నర్ కెప్టెన్ కాగా.. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం అక్షర్ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ సిరీస్ లో ఆల్ రౌండర్ గా విశేషంగా రాణిస్తున్నాడు. బంతితో, బ్యాట్ తో ఆకట్టుకుంటున్నాడు. కాబట్టి ఢిల్లీ యాజమాన్యం అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించనుంది. డేవిడ్ వార్నర్ మా కెప్టెన్. అక్షర్ అతనికి డిప్యూటీగా ఉంటాడు. అని ఢిల్లీ జట్టు మేనేజ్ మెంట్ లోని కీలక సభ్యుడొకరు తెలిపారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
కెప్టెన్ గా అపార అనుభవం
ఐపీఎల్ లో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ కు అపారమైన అనుభవం ఉంది. వార్నర్ దశాబ్దానికి పైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా 2016లో ట్రోఫీని అందించాడు. నాయకుడిగా, బ్యాటర్ గా ఎస్ ఆర్ హెచ్ కు ఎన్నో విజయాలు అందించాడు. అయితే 2022 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ వార్నర్ ను విడుదల చేసింది. ఆ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో వార్నర్ ఢిల్లీ ఆశలను నిలబెట్టాడు. 12 మ్యాచుల్లో 5 అర్ధసెంచరీల సాయంతో 432 పరుగులు చేశాడు. అందులో వార్నర్ అత్యుత్తమ స్కోరు 92 నాటౌట్.
అయితే ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వార్నర్ విఫలమయ్యాడు. ఇప్పటివరకు జరిగిన 2 టెస్టుల్లోనూ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. రెండో టెస్టులో సిరాజ్ బౌలింగ్ లో గాయపడిన వార్నర్ మిగిలిన 2 టెస్టులకు దూరమయ్యాడు. అయితే వచ్చే నెలలో భారత్ తోనే జరగనున్న వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ స్థానం దక్కించుకున్నాడు.