WPL 2023:
యూపీ వారియర్స్ కెప్టెన్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ అలీసా హేలీకి (Alyssa Healy) నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. మహిళల ప్రీమియర్ లీగు (WPL)లో ఆమె తమకు విజయాలు అందిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. స్థానిక అమ్మాయి, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మను (Deepti Sharma) కాదని ఆమెకు కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ మొదలవుతున్న సంగతి తెలిసిందే.
'మహిళా క్రికెటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టోర్నీ డబ్ల్యూపీఎల్. యూపీ వారియర్స్ (UP Warriarz) జట్టు అద్భుతంగా ఉంది. టోర్నీ మొదలవ్వగానే మెరవాలని ఆశగా ఉంది. మా జట్టులో అనుభవంతో పాటు యువ ప్రతిభావంతులు ఉన్నారు. అభిమానులను అలరించాలని వారంతా కోరుకుంటున్నారు. మేం గెలిచేందుకే వస్తున్నాం. భయం లేని క్రికెట్ బ్రాండ్‌తో ముందుకెళ్తాం' అని అలీసా హేలీ తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్లో అలీసా హేలీకి మంచి అనుభవం ఉంది. ఆమె ఏకంగా ఐదు టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. 2010, 2012, 2014, 2018, 2020 ప్రపంచకప్పులో ఆసీస్‌కు కీలకంగా ఆడింది. గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌నూ గెలిపించింది. టీ20 క్రికెట్లో 128 స్ట్రైక్‌రేట్‌తో 2446 పరుగులు చేసింది. 14 హాఫ్ సెంచరీలు బాదేసింది. మెగ్ లానింగ్ విరామం తీసుకోవడంతో కొన్ని రోజుల్నుంచి ఆసీస్‌కు సారథ్యం వహిస్తోంది. మహిళల బిగ్‌బాష్‌లో సిడ్నీ సిక్సర్‌కు నాయకత్వం వహించింది.
'టీ20 క్రికెట్లో అలీసా దిగ్గజం. అత్యున్నత క్రికెట్లో ఎంతో అనుభవం ఉంది. ఆమెకు గెలుపు ఓ అలవాటు. మా జట్టుకు ఇదే కావాలి' అని యూపీ వారియర్స్ యజమాని క్యాప్రీ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ శర్మ అన్నారు. 'డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ తనదైన ముద్ర వేయాలన్నదే మా కోరిక' అని పేర్కొన్నారు.
యూపీ వారియర్స్ : అలీసా హేలీ, సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ, తహిలా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్, పర్షవి చోప్రా, శ్వేతా షెరావత్, ఎస్.యశశ్రీ, కిరన్ నవగిరె, గ్రేస్ హ్యారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, సిమ్రన్ షేక్