Jasprit Bumrah:


టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా! ఎంతటి బ్యాటర్‌కైనా అతడిని ఆడటం సులభం కాదు. ప్రతి క్షణం మ్యాచ్‌ పరిస్థితులను మదింపు చేస్తూనే ఉంటాడు. బ్యాటర్‌ మైండ్‌ సెట్‌ను చదువుతూనే ఉంటాడు. అతడి మానసిక పరిస్థితిని అంచనా వేసి బంతులు వేస్తాడు. తక్కువ రనప్‌తోనే ప్రపంచడమైన వేగాన్ని సృష్టిస్తాడు. ఎప్పుడు గమనించినా ఉత్సాహంగానే కనిపిస్తాడు. అలాంటిది ఒకానొక సందర్భంలో అలసిపోయానని, తక్కువ వేగంతో బంతులేస్తానని స్వయంగా చెప్పాడట! భారత మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ ఈ సంఘటన గురించి తన పుస్తకం 'కోచింగ్‌ బియాండ్‌'లో వివరించాడు.


టీమ్‌ఇండియా 2019లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. నాలుగు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆతిథ్య జట్టును ఓడించింది. కుర్రాళ్లు, సీనియర్లు కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని అందించారు. ఆ సిరీసులోనే జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అలసిపోయాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఈ పేసుగుర్రం ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఆ తర్వాతి టెస్టుకోసం సిడ్నీకి చేరుకున్నాడు. చారిత్రకంగా ఆ పిచ్‌ పేసర్లకు అంతగా సహకరించింది. ఈ సారీ మరీ నిర్జీవంగా కనిపించింది. దాంతో ఆందోళనకు గురైన బుమ్రా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ను (Bharat Arun) సంప్రదించాడు.


'సర్‌.. వికెట్‌ కాస్త నిర్జీవంగా కనిపిస్తోంది. ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా లేదు' అని అరుణ్‌తో బుమ్రా చెప్పాడని శ్రీధర్‌ (R.Sridhar) రాశాడు. బౌలర్లు చెప్పిన మాటలను శ్రద్ధగా వినడమే అరుణ్‌ బలమని పేర్కొన్నాడు. ఆందోళనగా కనిపిస్తున్న బుమ్రా ఏదో చెప్పాలనకుంటున్నట్టు ఆయన గ్రహించాడని చెప్పాడు. అదేంటో తెలుసుకుందామని ఆగాడన్నాడు.


'నేను సొమ్మసిల్లిపోయాను సర్‌! మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. పర్సనల్‌గా నేనిలాంటి స్థితిలో ఉన్నాను. సిరీస్‌ పరంగా మనకేమీ ఇబ్బంది లేదు. పిచ్‌ మరీ నిర్జీవంగా ఉంది. బహుశా ఈ మ్యాచ్‌ డ్రా కావొచ్చు. మరి నన్నేం చేయమంటారు? వేగం తగ్గించి బంతులేయమంటారా' అని బుమ్రా ప్రశ్నించాడు. అప్పుడు భరత్‌ అరుణ్ అతడికి రెండు ఆప్షన్లు ఇచ్చాడని శ్రీధర్‌ వివరించాడు.


'మొదటిది నువ్వు నీ పరిమితికి తగ్గట్టు నెమ్మదిగా బౌలింగ్‌ చేయొచ్చు. మ్యాచ్‌ను సులభంగా తీసుకోవచ్చు. 130-132 కి.మీ వేగంతో బంతులేసి స్వదేశానికి వెళ్లి ప్రపంచకప్‌కు సిద్ధం కావొచ్చు. కానీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దీనివల్ల బ్యాటర్‌ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీ బౌలింగ్‌ను అతడు మెరుగ్గా ఎదుర్కొంటాడు. నువ్వు అలసిపోయావన్న సంగతి నీకు మాత్రమే తెలుసు. కానీ బ్యాటర్‌ అలా అనుకోడు. మార్నస్‌ లబుషేన్‌, షాన్‌ మార్ష్‌ వంటి ఆటగాళ్లు నీ బౌలింగ్‌లో బాగా ఆడుతున్నామని ఫీలవుతారు. ఆ తర్వాత ఫ్లాట్‌ వికెట్లో నువ్వు బౌలింగ్‌ చేస్తే నీపై మానసికంగా పైచేయి సాధిస్తారు. నీ బౌలింగ్‌కు అలవాటు పడతారు' అని అరుణ్‌ చెప్పాడన్నాడు.


'రెండో ఆప్షన్‌! ఐదారు ఓవర్లతో కూడిన రెండు స్పెల్స్‌ కఠినంగా వేయి. ఫ్లాట్‌ వికెట్‌ కాబట్టి ఆ తర్వాత నెమ్మదిగా వేయి. జీవం లేని పిచ్‌పైనా కఠినమైన బౌలింగుతో ఆకట్టుకున్నాడు అనే ముద్ర వేసుకో. మూడు, నాలుగో రోజు పిచ్‌ ఎలాగూ నెమ్మదిస్తుంది. ఆ తర్వాత మ్యాచులో బౌలర్లకు కొద్దిగా అనుకూలిస్తున్న పిచ్‌ దొరికినా బ్యాటర్‌ నీ బౌలింగ్‌కు భయపడతాడు. అతడిపై నువ్వే మానసికంగా పైచేయి సాధించొచ్చు. ఏది ఎంచుకుంటావన్నది నీ ఇష్టం. నేనైతే రెండోదే ఎంచుకోవాలని అంటాను' అని భరత్‌ పేసుగుర్రానికి చెప్పాడు. ఈ ట్రిక్‌ అద్భుతంగా పనిచేయడంతో ఆ తర్వాత బుమ్రా వచ్చి అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడని శ్రీధర్‌ అన్నాడు. తనకు ఇదో గొప్ప పాఠమని పేర్కొన్నట్టు తెలిపాడు.