KL Rahul:


కేఎల్‌ రాహుల్‌ విఫలమవ్వడం సంగతేమో కానీ! సోషల్‌ మీడియాలో అతడిపై విమర్శల వ్యవహారం చివరికి చినికి చినికి గాలివానగా మారుతోంది. అతడి కోసం మాజీ క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగుతున్నారు. కొన్ని రోజులుగా రాహుల్‌ను (KL Rahul) విమర్శిస్తున్న వెంకటేశ్‌ ప్రసాద్‌పై (Venkatesh Prasad) ఆకాశ్ చోప్రా (Aakash Chopra) యూట్యూబ్‌లో మాట్లాడాడు. అతడి మాటలకు హర్టైన వెంకీ.. తననెందుకు అజెండా ప్యాడ్లర్‌ అన్నావంటూ రుసరుసలాడుతున్నాడు.






టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కొన్ని రోజులుగా అంచనాలను అందుకోవడం లేదు. వరుసగా అవకాశాలు ఇస్తున్నా పరుగులేమీ చేయడం లేదు. కొందరు పెదవి విరుస్తున్నా భారత జట్టు యాజమాన్యం మాత్రం అతడికి అండగా నిలబడుతోంది. అతడిలో అపారమైన ప్రతిభ ఉందంటూ, కెరీర్‌లో ఇలాంటి గడ్డు దశలు అందరికీ ఎదురవుతాయని అంటోంది. శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నప్పుడు అతడిని తీసుకోవడంలో అర్థం లేదంటూ వెంకటేశ్‌ ప్రసాద్‌ కొన్ని రోజులుగా విమర్శిస్తున్నాడు. అతడి ఎంపిక సరికాదంటూ సోషల్‌ మీడియాలో పంచ్‌లు వేస్తున్నాడు.


మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ విమర్శలపై స్పందించాడు. రాహుల్‌కు మద్దతుగా కొన్ని గణాంకాలు చూపించాడు. తన యూట్యూబ్‌ ఛానళ్లో కొన్ని అంశాలను ఎత్తి చూపాడు. తానేమీ బీసీసీఐలో అవకాశం, సెలక్టర్‌ పదవి కోసం పాకులాడటం లేదన్నాడు. ఇది వెంకీని గాయపర్చినట్టుంది! ఇప్పటికి రెండు సార్లు అతడు సెలక్టర్‌ పదవి కోసం దరఖాస్తు చేశాడు. నియామక కమిటీ కనీసం అతడి అభ్యర్థిత్వాన్ని కనీసం పరిశీలించలేదు. ఇంటర్వ్యూకు పిలవలేదు. అందుకే సెలక్షన్‌ కమిటీ ఎంపికలను విమర్శించడమే అజెండాగా పెట్టుకున్నాడనే అర్థం వచ్చేలా ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. దానికి వెంకీ ఘాటుగా బదులిచ్చాడు.






'నా మిత్రుడు ఆకాశ్‌ చోప్రా తన య్యూటూబ్‌ ఛానళ్లో నన్నో అజెండా ప్యాడ్లర్‌గా చిత్రీకరించాడు. తెలివిగా కొన్ని గణాంకాలను చూపించలేదు. స్వదేశంలో మయాంక్‌ 70 శాతం సగటును చూపించలేదు. ఏ ఆటగాడి పైనా నాకు ప్రత్యేక అజెండా లేదు. బహుశా మరికొందరికి ఉండొచ్చు. అభిప్రాయబేధాలు ఉండటంలో తప్పేం లేదు. అయితే భిన్నమైన అభిప్రాయాన్ని అజెండా అనడం నవ్వు తెప్పిస్తోంది. కేఎల్‌ రాహుల్‌పై నాకేం కోపం లేదు. న్యాయంగా లేని సెలక్షన్‌ పైనే గళం వినిపిస్తున్నాను. బాగా ఆడుతున్న ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఉండటంపై మాట్లాడుతున్నా. మెరిట్‌ ఆధారంగానే సర్ఫరాజ్‌, కుల్‌దీప్‌ గురించి మాట్లాడుతున్నా. కానీ ఆకాశ్‌ నాది పర్సనల్‌ అజెండా అనడం నిరాశకు గురిచేసింది' అని వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లలో మాట్లాడాడు.