Harbhajan Singh:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా జరిగిన 2 టెస్టుల్లో ఆసీస్ ఓటమి పాలయ్యింది. తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందిన కంగారూలు.. రెండో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా జట్టుపై విమర్శలు గుప్పించాడు. ప్రస్తుత ఆసీస్ టీంను డూప్లికేట్ అంటూ వ్యాఖ్యానించాడు. 


ఔటవ్వడానికే ప్రాక్టీస్


భారత్ లో పర్యటిస్తున్న ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టుపై హర్భజన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా జట్టు రవిచంద్రన్ అశ్విన్ డూప్లికేట్ తో ప్రాక్టీస్ చేసింది. వాస్తవానికి ఇప్పడున్న ఆసీస్ జట్టు డూప్లికేట్ అని నేను భావిస్తున్నాను. వారు ప్రతికూల విషయాలపై దృష్టిసారిస్తున్నారు. వారి ఆలోచనా విధానం నెగెటివ్ గా ఉంది. వారి గందరగోళంతో సిరీస్ లో మొదటి బంతి పడకముందే ఓటమి పాలయినట్లు కనిపించింది. ఈ పర్యటన కోసం వారు ఎలాంటి సన్నద్ధత చేసినట్లు అనిపించడంలేదు. వారి ప్రదర్శన చూస్తుంటే అవుటవ్వడానికే ప్రాక్టీస్ చేసినట్లు కనిపిస్తోంది.' అంటూ హర్భజన్ విమర్శించాడు. 


ఈ సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు విముఖత చూపింది. ప్రాక్టీస్ కు పచ్చిక పిచ్ లు ఇచ్చి.. అసలు మ్యాచ్ కు స్పిన్ పిచ్ లు తయారు చేస్తారని ఆ జట్టు ఆటగాళ్లు చెప్పారు.  భారత్ స్పిన్ ను ఎదుర్కొనేందుకు వారు రోజుల తరబడి నెట్స్ లో శ్రమించారు. అయితే ఈ ఎత్తుగడ ఫలించలేదు. ఎంత స్పిన్ ను ప్రాక్టీస్ చేసినప్పటికీ టీమిండియా స్పిన్నర్ల ముందు వారు నిలవలేకపోయారు. ఫలితంగా భారత్ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీనిపైనా టర్బోనేటర్ మాట్లాడాడు. 


10 మ్యాచ్ ల సిరీస్ అయినా వారు ఒక్కటీ గెలవలేరు


ఈ సిరీస్ ను భారత్ 4-0 తో గెలుచుకుంటుందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. '4 మ్యాచ్ ల సిరీస్ అయినా.. 10 మ్యాచ్ ల సిరీస్ అయినా భారత్ ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ను టీమిండియా 4-0తో గెలుచుకుంటుందనడంలో నాకు ఎలాంటి సందేహంలేదు. ఈ ఆసీస్ జట్టుకు ముందడుగు వేసే శక్తిలేదు. పిచ్ కొంచెం స్పిన్నర్లకు సహకరించినా.. వారు తమ వికెట్లను తేలికగా ఇచ్చేస్తారు.' అని హర్భజన్ అన్నాడు.