Women T20 WC Semi-Final:  మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఐర్లాండ్ తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 87 పరుగులు చేసి విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. మార్చి 23న జరిగే సెమీస్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ గెలుపు అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. 


'ఈ విజయం మాకు చాలా ముఖ్యం. సెమీస్ కు చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా బాగా ఆడడానికి ప్రయత్నిస్తాం. సెమీ ఫైనల్స్ లో మేం మా బెస్ట్ ఇస్తాం. 100 శాతం కష్టపడతాం. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లను మేం ఎప్పుడూ ఆస్వాదిస్తాం. ఇది డూ ఆర్ డై మ్యాచ్ లాంటింది. అందుకే మేం మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం.' అని హర్మన్ చెప్పారు. 


ఆమె ఫాం మాకు అవసరం


ఐర్లాండ్ తో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ స్మృతి మంధానను హర్మన్ ప్రశంసించింది. 'ఐర్లాండ్ పై స్మృతి అలాంటి ఇన్నింగ్స్ ఆడడం మాకు చాలా మంచిదైంది. ఇది చాలా ముఖ్యం. స్మృతి మంచి ఆరంభాల్ని ఇచ్చినప్పుడల్లా మేం స్కోరు బోర్డుపై మంచి టోటల్ ను ఉంచుతాం.' అని హర్మన్ అంది. తాను 3వ స్థానంలో బ్యాటింగ్ కు రావడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును నేను కొంత సమయం మిడిలార్డర్ లో గడపాలనుకుంటున్నాను.' అని తెలిపింది. 






హర్మన్ @150


భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు అందుకున్నారు. టీ20 ఫార్మాట్ లో ప్రపంచంలోనే 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రీడాకారిణిగా హర్మన్ ఘనత సాధించారు.  మహిళల టీ20 ప్రపంచకప్ లో నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ కౌర్ కు 150వ టీ20 మ్యాచ్. అలాగే పొట్టి ఫార్మాట్ లో 3వేల పరుగులు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచారు. సుజీ బేట్స్, మెగ్ లానింగ్, స్టెఫానీ టేలర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మహిళా ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తింపు పొందారు. 


హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డులు



  • 150 టీ20 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్. పురుషుల, మహిళల క్రికెట్ లో ఎవరూ ఇంతవరకు ఈ మైలురాయిని అందుకోలేదు. 

  • పొట్టి ఫార్మాట్ లో 3వేల పరుగులు చేసిన నాలుగో మహిళా క్రీడాకారిణి.

  • విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన క్రికెటర్.

  • టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (103) స్కోరు చేసిన భారత మహిళా క్రికెటర్.

  • పొట్టి ఫార్మాట్ లో భారత తరఫున అత్యధిక సిక్సులు (70) కొట్టిన క్రీడాకారిణి. 

  • టీ20 ప్రపంచకప్ లో భారత తరఫున మిథాలీరాజ్ తర్వాత అత్యధిక మ్యాచ్ (14) లకు నాయకత్వం వహించిన కెప్టెన్.