Dinesh Kartik On KL Rahul:  భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. అన్ని ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా విఫలమవుతున్నాడంటూ అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జట్టులో స్థానం ఎందుకంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ కేఎల్ రాహుల్ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 


రాహుల్ ను తప్పించాలి


ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలని చెప్పాడు. 'రాహుల్ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకు అర్ధమవుతోంది. ఎందుకంటే నేనూ ఒకప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. అయితే ఆసీస్ తో మిగిలిన రెండు టెస్టులకు కేఎల్ ను పక్కన పెడితే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ నిర్ణయం 2 మ్యాచుల ప్రదర్శనను బట్టి తీసుకున్నది కాదని అతడు గ్రహించాలి. గత 5, 6 టెస్టులుగా రాహుల్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. మిగిలిన 2 మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుని తర్వాత జరిగే వన్డే సిరీస్ కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలి' అని కార్తీక్ అన్నాడు. 


రాహుల్ స్థానంలో గిల్ కు చోటివ్వాలి


భారత్- ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ ను తుది జట్టు నుంచి తప్పించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాహుల్ ప్లేయింగ్ ఎలెవన్ లో లేకపోతే అతడి స్థానంలో శుభ్ మన్ గిల్ ను ఆడించే అవకాశం ఉంది. దీనిపైనా కార్తీక్ మాట్లాడాడు. 'కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలో రాణించే సత్తా ఉన్న ఆటగాడు. అయితే ప్రస్తుత పరిస్థితిని అతడు అర్థం చేసుకోవాలి. రాహుల్ స్థానంలో శుభ్ మన్ గిల్ ను ఆడించాలి. అతడు అద్భుతమైన ఆటగాడు.' అని కార్తీక్ అన్నాడు. 






రోహిత్ తో గిల్ ఓపెనింగ్ చేయాలి: హర్భజన్ సింగ్


వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ ను తప్పించి ఆసీస్ తో మిగిలిన టెస్టులకు శుభ్ మన్ గిల్ కు అవకాశమివ్వాలని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. 'రాహుల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ కాదు. వైస్ కెప్టెన్ గా ఉంటే అతడి ప్రదర్శన ఎలా ఉన్నా తుది 11 మందిలో చోటు దక్కుతుంది. ఇప్పుడు ఆ ట్యాగ్ లేదు కాబట్టి అతడు తుది జట్టులో ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. అతను తొలి రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు. నా ఉద్దేశ్యం ప్రకారం మూడో టెస్టులో రోహిత్ తో కలిసి శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ చేయవచ్చు. కేఎల్ రాహుల్ నాణ్యమైన ఆటగాడే. అయితే ఇప్పుడు అతను పేలవ దశను ఎదుర్కొంటున్నాడు.' అని హర్భజన్ అన్నాడు.