Aiden Markram SRH Captain:  ఐపీఎల్ 2023 సీజన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన కెప్టెన్ ను ప్రకటించింది. ఈ సీజన్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్ మార్ క్రమ్ ఎస్ ఆర్ హెచ్ జట్టును నడిపించనున్నాడు. మార్ క్రమ్ ను కెప్టెన్ గా నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 


గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఈ ప్రొటీస్ ఆటగాడిని సన్ రైజర్స్ రూ. 2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో మార్ క్రమ్ ఓ మోస్తరుగా రాణించాడు. 47.63 సగటులో 381 పరుగులు చేశాడు. గత నెలలో దక్షిణాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టును నడిపించిన మార్ క్రమ్ జట్టుకు టైటిల్ ను అందించాడు. అలాగే 2014లో దక్షిణాఫ్రికా అండర్- 19 జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.  ఐపీఎల్ మినీ వేలంలో భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను కూడా ఎస్ ఆర్ హెచ్ కొనుగోలు చేసింది. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టులో ఉన్నాడు. వీరిని కాదని అయిడెన్ మార్ క్రమ్ ను కెప్టెన్ గా నియమించడం విశేషం. 


సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మార్ క్రమ్ జట్టును ముందుండి నడిపించాడు. కెప్టెన్ గా, ఆటగాడిగా రాణించాడు. ఈ లీగ్ లో ఒక సెంచరీతో సహా మొత్తం 366 పరుగులు చేశాడు. 11 వికెట్లు కూడా తీశాడు. 






దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో మార్ క్రమ్


28ఏళ్ల అయిడెన్ మార్ క్రమ్ అరంగేట్రం చేసిన తొలినాళ్లలో దక్షిణాఫ్రికా తరఫున భవిష్యత్ స్టార్ గా పేరు గాంచాడు. అయితే తర్వాత అతను అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ ప్రస్తుతం మళ్లీ  రాణిస్తున్నాడు. తన ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో స్థిరంగా  రాణిస్తున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికా టెస్ట్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ విభాగంలో మార్ క్రమ్ 5వ స్థానంలో ఉన్నాడు. 


2021 సీజన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. గత సీజన్ లోనూ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేదు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లను ఎస్ ఆర్ హెచ్ వదులుకుంది. కుర్రాళ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. మార్ క్రమ్ సారథ్యంలో తమ జట్టు మెరుగ్గా రాణిస్తుందని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.