RR vs RCB, IPL 2022: Virat Kohli Unbelievable Catch to Dismiss Trent Boult in game against Rajasthan Royals- Watch Video : ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. బ్యాటుతో పరుగులు చేయడం లేదు. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. గాల్లోకి డైవ్ చేసి మరీ క్యాచులు అందుకుంటున్నాడు. అభిమానుల చేత ఔరా! అనిపించుకుంటున్నాడు.
పుణె వేదికగా రాజస్థాన్‌తో మ్యాచులో విరాట్ అమేజింగ్ ఫీల్డింగ్ చేశాడు. గాల్లోకి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఈ వీడియో, చిత్రాలు వైరల్‌గా మారాయి. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో 17.1వ బంతిని చక్కని లెంగ్తులో హర్షల్ పటేల్ విసిరాడు. ఆ బంతిని ట్రెంట్ బౌల్ట్ ఆడాడు. బ్యాటు లోపలి అంచుకు తగిలిన బంతి నేరుగా షార్ట్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి లేచింది. వేగంగా స్పందించిన విరాట్ వెంటనే ఎడమ వైపు గాల్లోకి డైవ్ చేశాడు. బంతిని ఒడిసిపట్టాడు. దాంతో స్టన్ అవ్వడం బౌల్ట్ వంతు అయింది.
ఇక ఈ మ్యాచులోనూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అర్ధశతకాలు చేయలేదు. రెండు మూడు సార్లు డకౌట్ అయ్యాడు. అతడిని ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ఓపెనర్‌గా పంపించింది. ఎక్కువ సమయం దొరికితే నిలదొక్కుకుంటాడని భావించింది. అందుకు తగ్గట్టే ఈ మ్యాచులో ఆర్సీబీ ముందు తక్కువ టార్గెట్టే ఉంది. 145 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. దాంతో విరాట్ నిలుస్తాడని అభిమానులు ఆశించారు.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విరాట్ 10 బంతులాడి 9 పరుగులకే ఔటయ్యాడు. 2 బౌండరీలు కొట్టాడు. అప్పటికే ట్రెంట్‌బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో ఇన్‌సైడ్ ఎడ్జ్ రూపంలో రెండుసార్లు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ రెండో ఓవర్లో ప్రసిద్ధ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుసగా 3 బంతులు డాట్ అవ్వడంతో ఎలాగైనా పరుగులు చేయాలని కోహ్లీ అనుకున్నాడు. షార్ట్‌పిచ్‌లో వేసిన బంతి తలమీదుగా వెళ్తుంటే బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడబోయాడు. గాల్లోకి లేచిన బంతిని రియాన్ పరాగ్ అమేజింగ్ డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు.