IPL 2022 virat kohli to open against rajasthan royals kohli opening records : ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals)తో జరుగుతున్న మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) టాస్‌ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్‌  డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఇన్నాళ్లూ ఓపెనర్‌గా విఫలమైన అనుజ్‌ రావత్‌ జట్టులో చోటు కోల్పోయాడని చెప్పాడు. అతడి స్థానంలో రజత్‌ పాటిదార్‌ వచ్చాడని వివరించాడు. ఈ మ్యాచులో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తనతో కలిసి ఓపెనింగ్‌ చేస్తాడని వెల్లడించాడు. కాగా ఇక నుంచి జరగబోయే మూడు మ్యాచుల్లో విరాట్‌ తన ప్రత్యేకతను చూపకపోతే ఆశ్చర్యమేనని ఆర్‌సీబీ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ అంటున్నాడు. మరి ఓపెనింగ్‌ పొజిషన్‌లో విరాట్‌ రికార్డు ఎలా ఉందంటే?


ఘోరమైన ఫామ్‌!


ఐపీఎల్‌ 2022లో విరాట్‌ కోహ్లీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. లీగు చరిత్రలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఆడలేదు. 8 మ్యాచుల్లో  17 సగటు, 122 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 119 పరుగులే చేశాడు. కొట్టిన సిక్సర్లు 2. బౌండరీల సంఖ్య 10 దాటలేదు. రీసెంట్‌ స్కోర్లు 41*, 12, 5, 48, 1, 12, 0, 0గా ఉన్నాయి. ప్రత్యర్థులు పన్నుతున్న ఉచ్చులో ఊరికే పడిపోతున్నాడు. కాసేపు మైదానంలో సెటిల్‌ అవ్వడానికి ప్రయత్నించడమే లేదు. దేహానికి దూరంగా ఆఫ్‌సైడ్‌ ది ఆఫ్‌స్టంప్‌గా వేస్తున్న బంతుల్ని వెంటాడి మరీ ఔటవుతున్నాడు. బహుశా ఓపెనింగ్‌ పొజిషన్‌లో అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.


ఓపెనర్‌గా 'కింగ్‌'!


విరాట్‌ కోహ్లీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒకటి. వన్‌డౌన్‌లో వచ్చి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడం. అద్భుతమైన విజయాలు అందించడం. నిజానికి టీ20ల్లో కింగ్‌ కోహ్లీకి ఓపెనింగే బెస్ట్‌! అతడి గణాంకాలు చెబుతున్నది ఇదే.  ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 76 ఇన్నింగ్సుల్లో అతడు ఓపెనింగ్‌ చేశాడు. 13 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.  18 హాఫ్‌ సెంచరీలు, 5 సెంచరీల సాయంతో 2750 పరుగులు చేశాడు.  సగటు 43.65 కాగా స్ట్రైక్‌రేట్‌ 136.68. మిగతా అన్ని పొజిషన్ల కన్నా అతడికి ఇవే అత్యుత్తమ గణాంకాలు. వన్‌డౌన్‌లో 93 ఇన్నింగ్సులు ఆడిన విరాట్‌ 35 సగటు, 123 స్ట్రైక్‌రేట్‌తో 2815 పరుగులు చేశాడు.