RCB vs RR, 1 innings highlights: ఐపీఎల్‌ 2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ మోస్తరు స్కోరే చేసింది. 20 ఓవర్లకు 144/8 పరుగులు చేసింది. ప్రత్యర్థికి ఈజీ టార్గెట్‌ ఇచ్చింది. రియాన్ పరాగ్‌ (56; 31 బంతుల్లో 1x4, 1x6) నాటౌట్‌గా నిలిచాడు. అద్భుతమైన హాఫ్‌ సెంచరీ చేశాడు. సంజు శాంసన్‌ (27; 21 బంతుల్లో 1x4, 3x6) ఫర్వాలేదనిపించాడు. ఆర్సీబీలో   మహ్మద్‌ సిరాజ్‌, హేజిల్‌ వుడ్‌, హసరంగ తలో 2 వికెట్లు పడగొట్టారు.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (7)ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (17; 9 బంతుల్లో 4x4)నూ అతడే 3.6వ బంతికి పెవిలియన్‌ పంపించాడు. వరుస సెంచరీలతో ఊపుమీదున్న జోస్‌ బట్లర్‌ (8)ని జోష్‌ హేజిల్‌వుడ్‌ ఆ తర్వాత బంతికే ఔట్‌ చేయడంతో 33/3తో రాజస్థాన్‌ కష్టాల్లో పడింది.


అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఏమాత్రం భయపడలేదు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చక్కని బౌండరాలు, సిక్సర్లు కొట్టాడు. డరైల్‌ మిచెల్‌ (16; 24 బంతుల్లో) స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో అతడిపై మెరుగైన రికార్డున్న మిస్టరీ స్పిన్నర్‌ హసరంగను డుప్లెసిస్‌ ప్రయోగించాడు. అతడి బౌలింగ్‌ను గౌరవించకుండా రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి సంజు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 68.


మరోవైపు మిచెల్‌ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా కనెక్ట్‌ అవ్వకపోవడంతో 14.2వ బంతికి ఔటయ్యాడు. కొద్దిసేపట్లోనే హెట్‌మైయిర్ (3)ను హసరంగే ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా సరే రాజస్థాన్‌ చిచ్చరపిడుగు పరాగ్‌ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. దొరికిన బంతిని బౌండరీకి పంపించాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాది 18 పరుగులు సాధించాడు. దాంతో స్కోరు 144కు చేరుకుంది.