Rishabh Pant News: భారత క్రికెట్లో మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, ప్రస్తుత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కచ్చితంగా ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు ముగ్గురు కలిసి ఎన్నో టోర్నీలు జట్టుకు గెలిపించారు. వీరి ముగ్గురి కలయికలో 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. అలాగే జట్టు ప్రతిష్టాత్మక సాధించిన విజయాలైన 2007 టీ20 ప్రపంచకప్ లో ధోనీ, రోహిత్, 2011 వన్డే ప్రపంచకప్ లో ధోనీ, కోహ్లీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను సాధించడంతో రోహిత్, కోహ్లీలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు తాజాగా ఒక అకేషన్ లో కనిపించనున్నారు. దానికి భారత విధ్వంసక వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారణం కానున్నాడు. అతని చెల్లిలి పెళ్లి ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో జరుగనుంది. దీనికి ఈ దిగ్గజ త్రయం హాజరుకానున్నారు.
ఫుల్ ఫాలోయింగ్..
పంత్ చెల్లెలు సాక్షి పంత్ కు సోషల్ మీడియాలో ఘనమైన ఫాలోయింగే ఉంది. తనను లక్షల్లో మంది ఫాలో అవుతున్నారు. పంత్ చెల్లెలు కావడంతోపాటు ట్రావెలాగ్, ట్రెండీ దుస్తులు ధరించడంతో యువతతోపాటు పలు వర్గాల ప్రజలు ఆమెను ఫాలో అవుతన్నారు. తన బాయ్ ఫ్రెండ్ అంకిత్ చౌదరీని పెళ్లి చేసుకోనుంది. ముస్సోరీలో రహస్యంగా జరిగే ఈ వేడుకకు ధోనీ, రోహిత్, కోహ్లీ హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక బిజినెస్ మేన్ అయిన అంకిత్ తో తొమ్మిదేళ్లుగా ప్రేమలో మునిగి పోయింది. గతేడాది జనవరిలో లండన్ లో వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. దీనికి ధోనీ కూడా హాజరయ్యాడు.
ఐపీఎల్ కు రెడీ..
ఈనెల 22 నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ 2025 కు పంత్ రెడీ అవుతున్నాడు. ఈ సీజన్ లో తను లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన వేలంలో తనను రూ.27 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. టోర్నీ చరిత్రలో పంతే ఖరీదైన ప్లేయర్ కావడం విశేషం. తనను లక్నో కెప్టెన్ గా కూడా యాజమాన్యం నియమించింది. ఇక 2022 డిసెంబర్ లో ప్రాణాపాయ యాక్సిడెంట్ లో గాయపడిన పంత్.. తర్వాత కోలుకుని ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యునిగా ఉన్నాడు. అలాగే ఇటీవల భారత్ సాధించిన చాంపియన్స్ ట్రోఫీ బృందంలోనే తను మెంబర్ గా ఉన్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్సీ వహించిన పంత్.. ఈ ఏడాది లక్నోకు ఆడుతున్నాడు. ఇక ఈనెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఆ తర్వాతి రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ టోర్నీ మే25 వరకు జరగునుంది.