Rishabh Pant IPL 2023:


రిషభ్ పంత్‌ ఐపీఎల్‌ భవితవ్యం గురించి సౌరవ్‌ గంగూలీ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తర్వాతి సీజన్‌కు అతడు పూర్తిగా దూరమవుతాడని వెల్లడించాడు. అతడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నాడు. తనకు దిల్లీ క్యాపిటల్స్‌తో అనుబంధం ఉందని స్పష్టం చేశాడు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడాడు.


రూర్కీ నుంచి దిల్లీ వస్తుండగా రిషభ్ పంత్‌ ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణించిన కారు మంటల్లో దగ్ధమైంది. అదృష్టవశాత్తు అతడు ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే కారు నుంచి బయటపడ్డాడు. కొందరు అతడి డెహ్రాడూన్‌లోని ఆస్పత్రికి తరలించారు. ముఖంపై గాట్లు, మోకాలు, పాదాల్లో గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం అతడిని ముంబయిలోని ధీరూబాయ్‌ అంబానీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ పార్ధీవాలా నేతృత్వంలో రిషభ్ పంత్‌కు మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే.


'ఐపీఎల్‌కు రిషభ్ పంత్‌ అందుబాటులో ఉండడు. దిల్లీ క్యాపిటల్స్‌తో నాకు సంబంధాలు ఉన్నాయి. రాబోయే సీజన్‌ గొప్పగా ఉండబోతోంది. మేం మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఏదేమైన పంత్‌ గాయంతో డీసీపై ప్రభావం పడుతుంది' అని సౌరవ్‌ గంగూలీ కోల్‌కతాలో మీడియాకు చెప్పాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా పదవీకాలం ముగిశాక దాదా మళ్లీ ఐపీఎల్‌ బాట పట్టాడు. దిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయనున్నాడు.


రిషభ్‌ పంత్‌ లేకపోవడంతో డేవిడ్‌ వార్నరే దిల్లీ క్యాపిటల్స్‌ పగ్గాలు అందుకుంటాడని తెలుస్తోంది. కెప్టెన్‌గా అతడికి మంచి అనుభవం ఉంది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజేతగా నిలిపాడు. ఏటా నిలకడగా పరుగులు చేస్తాడు. అతడికి గానీ సరైన సహకారం అందిస్తే అద్భుతాలు చేయగలడు. కాగా లీగుకు దూరమవుతున్న పంత్‌కు బీసీసీఐ సాయం చేస్తోంది. ఐపీఎల్‌ వేతనం రూ.16 కోట్లు, సెంట్రల్‌ కాంట్రాక్టు వేతనం రూ.5 కోట్లు పరిహారంగా ఇవ్వనుంది.