IPL 2023 LIVE Streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ మరింత పెద్దదిగా, ఇంకా మెరుగ్గా మారబోతోంది. ఈ ఏడాది ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ భాగస్వామి వయోకామ్ 18 తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్ మరింత మందికి చేరువ కానుంది. ఐపీఎల్ వీక్షకుల సంఖ్యను పెంచుకునేందుకు ఈ స్ట్రీమింగ్ పార్ట్ నర్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఎన్నడూ లేనట్లుగా రెండు వేర్వేరు సంస్థలు ఐపీఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేశాయి. బ్రాడ్ కాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకోగా... లైవ్ స్ట్రీమింగ్ హక్కులను వయోకామ్ 18 కొనుగోలు చేసింది. అంటే వూట్ యాప్ లో ఈ ఏడాది ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ఐపీఎల్ లో సీజన్ లో తమ యాప్ సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు వయోకామ్ 18 ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
11 భాషల్లో స్ట్రీమింగ్
ఐపీఎల్ 2023 సీజన్ ను మొత్తం 11 భాషల్లో ప్రసారం చేసేలా వయోకామ్ 18 నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2022 ఐపీఎల్ సీజన్ 6 భాషల్లోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాష్లలో 15 వ సీజన్ ప్రసారం అయ్యింది. ఈ ఏడాది ఇంకో 5 భాషలకు దాన్ని పెంచనున్నట్లు వయోకామ్ 18 ఒక ప్రకటనలో తెలిపింది. అందులో భోజ్ పురి కూడా ఉంది. ఇది హిందీ తర్వాత భారతదేశంలో అత్యధికులు మాట్లాడే రెండో భాష. ఐపీఎల్ ను 11 భాషల్లో ప్రసారం చేయాలన్న నిర్ణయం ఈ సీజన్ లో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉంది. దీనివలన ఐపీఎల్ పరిధి పెరగనుంది. ఈ క్రమంలో వయోకామ్ 18 యాప్ కు సబ్ స్రైబర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ ను ఒక్క డిజిటల్ లోనే 500 మిలియన్ల మంది వీక్షిస్తారని అంచనా.
ప్రసార హక్కుల కోసం భారీగా చెల్లించిన వయోకామ్ 18
భారత ఉపఖండం కోసం ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ హక్కులను వయోకామ్ 18 రూ. 20,500 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. అంటే ఒక్కో మ్యాచ్ కు సుమారు రూ. 50కోట్లు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ధరలో 50 శాతం కూడా రికవరీ చేయడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే వయాకామ్ 18 ఐపీఎల్ ను మరిన్ని భాషల్లో ప్రసారం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.