Virat Kohli angry : ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఆటగాడు విరాట్‌కోహ్లీ (Virat Kohli)తన స్ట్రైక్‌ రేట్‌పై కొందరు చేస్తున్న విమర్శలపై మండిపడ్డాడు. గుజరాత్‌ టైటాన్స్‌(GT)పై విజయం తర్వాత తన స్ట్రైక్‌ రేట్‌పై వస్తున్న విమర్శలను  పట్టించుకోనని కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో 16 ఓవర్లలో 201 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు మరో 24 బంతులు మిగిలి ఉండగానే తేలిగ్గా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకం చేసి అజేయంగా నిలిచాడు. ఈ  మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వచ్చాయి. కోహ్లీ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 బంతుల్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్‌ మరీ నెమ్మదిగా ఆడాడని సోషల్‌ మీడియాలో కొందరు పోస్ట్‌లు పెట్టారు. దీనిపై మ్యాచ్‌ ముగిసిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ స్పందించాడు. 




విమర్శకులకు అదే పని
స్పిన్‌లో తన స్ట్రైక్ రేట్‌ తక్కువ ఉందని మాట్లాడే వారందరూ తాను స్పిన్‌ను బాగా ఆడతానని అంగీకరిస్తారని అనుకుంటున్నానని కోహ్లీ అన్నాడు. తాను తన జట్టు కోసం ఆడతానని... విమర్శకుల కోసం కాదని కోహ్లీ గట్టిగా ఇచ్చి పడేశాడు. రోజు విడిచి రోజు తనపై విమర్శలు చేస్తూనే ఉంటారని... తాను తన జట్టు గెలుపు కోసం ఆడతానని... ఒక బాక్స్‌లో కూర్చుని ఆట గురించి మాట్లాడే వాళ్లకు అది తెలీదని కోహ్లీ అన్నాడు. విమర్శకులు తమ ఆలోచనలు, ఊహల గురించి కూర్చుని మాట్లాడగలరని... విమర్శించ గలరని కానీ.... మైదానంలో ఆడేది తానని... తన జట్టు కోసం ఏం చేయాలో తనకు తెలుసని కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు బ్యాటర్‌, కింగ్ కోహ్లీ 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్‌  దగ్గరే ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 71.42 సగటుతో సరిగ్గా 500 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 113 నాటౌట్‌.


గుజరాత్‌పై ఘన విజయం
ఐపీఎల్‌(IPL)లో ఆలస్యంగా పుంజుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)... వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. విల్‌ జాక్స్‌ మెరుపు శతకంతో మెరవడంతో గుజరాత్‌ టైటాన్స్‌(GT)పై ఘన విజయం సాధించింది. విల్‌ జాక్స్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేశాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో సిక్స్‌ కొట్టిన జాక్స్‌... శతక గర్జన చేశాడు. విరాట్‌ కోహ్లీ కూడా అద్భుత అర్థ శతకంతో మరోసారి రాణించాడు. దీంతో 200 పరుగుల లక్ష్యాన్ని మరో 24 బంతులు మిగిలి ఉండగానే కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి... బెంగళూరు సునాయసంగా ఛేదించింది.