Fans React ON Ajinkya Rahane Fails: చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)  బ్యాటర్‌ అజింక్యా రహానే(Ajankya Rahane) వరుస వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో  చెన్నై అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే రిటైర్‌ అవ్వాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అజింక్య రహానే 12 బంతుల్లో కేవలం 9 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత రహానేపై విమర్శలు చెలరేగాయి. 35 ఏళ్ల రహానే ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతుండడంపై  చెన్నై అభిమానులు మండిపడుతున్నారు. రహానే తొమ్మిది మ్యాచ్‌ల్లో 123.19 స్ట్రైక్ రేట్‌తో కేవలం 170 పరుగులు మాత్రమే చేశాడు. రహానే ఫామ్‌, ఆటతీరుపై అభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రహానే గత ఇన్నింగ్స్‌లో స్కోరులు 35(30), 5(8), 36(24), 1(3), 9(12) ఇలా ఉన్నాయంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 




మండిపడుతున్న అభిమానులు...
రహానేకు ఇదే చివరి ఐపీఎల్‌ అని ఓ అభిమాని పోస్ట్‌ చేశాడు. "మిస్టర్ రహానేను ఇంకా చెన్నై ఎందుకు ఆడిస్తుందో తెలీడం లేదు. రహానే వేరే ఆటగాడిగా అవకాశం లేకుండా చేస్తున్నాడు. చెన్నైది ఓ చెత్త ఎంపిక అని మరో నెటిజన్‌ మండిపడ్డాడు. త్వరగా రహానే రిటైర్ అవ్వాలి. ఇక భరించలేమంటూ ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. రహానే బదులు తాను చెన్నై ఇన్నింగ్స్‌ ప్రారంభించినా మెరుగైన స్కోరు చేస్తానని మరో అభిమాని అన్నాడు. అజింక్య రహానే మళ్లీ పాతకాలానికి వెళ్లిపోయాడు... పవర్ ప్లేలో చెన్నై స్ట్రైక్ రేట్ తగ్గించి... తర్వాత రహానే అవుటవుతున్నాడని  మరో అభిమాని మండిపడ్డాడు.




హైదరాబాద్‌పై చెన్నై విజయం
చెన్నై లోని చెపాక్‌ స్టేడియం లో లో చెన్నై జట్టు అదరగొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.
బ్యాటింగ్ సన్ రైజర్స్ లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్ హెడ్ , అభిషేక్ శర్మ తక్కువ పరుగులతో అవుట్ అయి తీవ్ర నిరాశ పరిచారు. మార్క్రమ్ తప్ప ఎవరు స్కోర్ ను కాస్త కూడా ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు. చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. పతిరన, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. చెన్నై చేతిలో భారీ ఓటమితో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై, హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఉండడం ఆసక్తి రేపుతోంది. అయిదు జట్లు కూడా పదే పాయింట్లతో ఉన్నా నెట్‌ రన్‌రేట్‌ కారణంగా జట్ల స్థానాలు మారాయి.