KKR vs DC IPL 2024 Head to Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 47వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) తలపడనుంది. ముంబై, లక్నోలపై పోరాడి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. కోల్‌కత్తా లోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేదు. కోల్‌కత్తా మాత్రం 2012, 2014లో టైటిల్‌ను ఒడిసిపట్టింది.
రికార్డులు ఇలా...
కోల్‌కత్తా-ఢిల్లీ ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్‌కత్తా 17 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ వేదికగా అత్యధికంగా పది మ్యాచులు జరగగా... అందులో అయిదు ఢిల్లీ.. అయిదు కోల్‌కత్తా గెలిచాయి. ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య 9 మ్యాచ్‌లు జరగగా, KKR 7 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, DC 2 గెలిచింది. ఈ ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన ఎనిమిది మ్యాచుల్లో అయిదు విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో కొనసాగుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉన్నాడు. రస్సెల్ విధ్వంసం జరుగుతుందేమో చూడాలి.
పిచ్ రిపోర్ట్
ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లు భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. పిచ్ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు కూడా సహకారం అందించే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉంటే టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతుంది. ఢిల్లీ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బలహీనమైన కోల్‌కత్తా బౌలింగ్‌లో ఫ్రేజర్ మరింత విధ్వంసకరంగా ఆడతానడంతో సందేహం లేదు. మామూలు బౌలర్లు దొరికితే ఫ్రేజర్ ఎంత విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. మెక్‌గర్క్‌తో పాటు స్టబ్స్ కూడా తన అద్భుతమైన పవర్ హిట్టింగ్‌తో అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాడు.
అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, పంత్, స్టబ్స్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. పంత్ ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్నాడు. కోల్‌కత్తా బ్యాటర్ నరైన్ సంచలనాత్మక ఫామ్‌లో ఉన్నాడు. నరైన్ ఎనిమిది మ్యాచ్‌లలో రెండు అర్ధసెంచరీలు, ఒక సెంచరీతో 357 పరుగులు చేశాడు. నరైన్-ఫిల్ సాల్ట్ జోడీ కోల్‌కత్తాకు మంచి ఆరంభాలు అందిస్తోంది.