CSK vs SRH IPL 2024 Chennai Super Kings won by 78 runs:  చెన్నై లోని చెపాక్‌ స్టేడియం లో లో చెన్నై జట్టు అదరగొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  మ్యాచ్‌లో  మొదట చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)  భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.  213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది.  ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. 


బ్యాటింగ్  సన్ రైజర్స్ లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్ హెడ్ , అభిషేక్ శర్మ  తక్కువ పరుగులతో  అవుట్ అయి తీవ్ర నిరాశ పరిచారు.  మార్క్రమ్ తప్ప ఎవరు స్కోర్ ను కాస్త కూడా ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు. చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. పతిరన, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 


చెన్నై బ్యాటింగ్ ఎలా సాగిందంటే .. 


ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి  బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 19 పరుగుల స్కోరు వద్ద చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 12 బంతుల్లో ఒక ఫోర్‌తో తొమ్మిది పరుగులు చేసిన అజింక్యా రహానేను భువనేశ్వర్‌ కుమార్‌ అవుట్‌ చేశాడు.  షెహబాజ్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రుతురాజ్‌తో జత కలిసిన డేరిల్‌ మిచెల్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి చెన్నైకు తిరుగులేని పునాది వేశారు. ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది రెండో వంద పరుగుల భాగస్వామ్యం కాడవం విశేషం. పవర్‌ ప్లే ముగిసే సరికి చెన్నై ఒక వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది.  

 

డారిల్‌ మిచెల్‌- రుతురాజ్‌ క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడారు.  సిక్సర్‌తో రుతురాజ్‌ అర్థ శతకాన్ని అందుకున్నాడు. 26 బంతుల్లో రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. .తర్వాత 29 బంతుల్లో మిచెల్ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 134 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన మిచెల్‌ అవుటయ్యాడు. ఉనద్కత్‌ బౌలింగ్‌లో నితీశ్‌రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ పెవిలియన్‌ చేరాడు. కానీ రుతురాజ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేసి రుతురాజ్‌ అవుట్‌ చేశాడు. కచ్చితంగా శతకం చేస్తాడని భావించినా రుతురాజ్‌ను 98 పరుగుల వద్ద నటరాజన్‌ అవుట్‌ చేశాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో రుతురాజ్‌ అవుటయ్యాడు.

200 పరుగుల వద్ద చెన్నై సూపర్‌ కింగ్స్ మూడో వికెట్‌ కోల్పోయింది. శివమ్ దూబే ఎప్పట్లాగే చివర్లో మెరుపులు మెరిపించడంతో  చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దూబే 20 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, ఉనద్కత్‌ ఒక్కో వికెట్‌ తీశారు.