ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. పాండ్యాను గుజరాత్ టైటాన్స్‌ నుంచి ముంబై కొనుక్కుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు బాధ్యతలను రోహిత్ శర్మ చూసుకునేవాడు. 






ముంబై జట్టుకు రోహిత్ సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌ మ్యాన్ కెప్టెన్సీలోనే ముంబై ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్ గెలుచుకుంది. అయితే ఇప్పుడు రోహిత్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్ గా నిలిపాడు.


పాండ్యాను కెప్టెన్‌గా చేసే విషయాన్ని ముంబై తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. వచ్చే సీజన్‌లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఆడుతూ విజయాలు సాధిస్తూ వచ్చింది. 2013 నుంచి కెప్టెన్‌గా ఉంటూ వచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడుగా రోహిత్ నిలిచాడు. 






పాండ్యా గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు గత సీజన్లో ఆ జట్టు ఫైనల్స్‌కి కూడా చేరింది. హార్దిక్ వ్యక్తిగత ఐపీఎల్ ప్రదర్శనను పరిశీలిస్తే.. పాండ్యా ఇప్పటివరకు 123 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2309 పరుగులు చేశాడు. వీటితో పాటు 53 వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో హార్దిక్ 17 పరుగులిచ్చి 3 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీలో 10 హాఫ్ సెంచరీలు సాధించాడు.


రోహిత్ శర్మ ముంబైకి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై టైటిల్ గెలుచుకుంది. రోహిత్ వ్యక్తిగత ఐపీఎల్ ప్రదర్శనను గమనిస్తే అతను కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. 243 మ్యాచ్‌ల్లో 6211 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏప్రిల్ 2008లో రోహిత్ తన ఫస్ట్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. డెక్కర్ ఛార్జ్స్ తరఫున రోహిత్ అరంగేట్రం చేశాడు.