Mumbai Indians vs Rajasthan Royals: ఐపీఎల్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన దశలో టిమ్ డేవిడ్ (45 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగాడు.


ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (55: 29 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా యశస్వి జైస్వాల్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. యశస్వి జైస్వాల్ తప్ప మరే ఇతర రాజస్తాన్ బ్యాటర్ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు.


190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (3: 5 బంతుల్లో) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 14 పరుగులు మాత్రమే. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (28: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు), వన్ డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ (44: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) స్కోరును ముందుకు నడిపించారు. వీరు రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.


ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తన వరుస ఓవర్లలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరినీ అవుట్ చేసి ముంబైని గట్టి దెబ్బ కొట్టాడు. తిలక్ వర్మ (29: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (55: 29 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) కలిసి ముంబై ఇండియన్స్‌ను తిరిగి ట్రాక్ మీదకి తీసుకువచ్చారు. వీరు నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఈ దశలో సూర్యకుమార్ అవుటయ్యాడు. కానీ తిలక్ వర్మ (29: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), టిమ్ డేవిడ్ (45 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) కలిసి ముంబైని గెలుపు బాట పట్టించారు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సి రాగా టిమ్ డేవిడ్ మూడు సిక్సర్లతో ముంబైని గెలిపించాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), జోస్ బట్లర్ (18: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రాజస్తాన్‌కు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే చెలరేగి ఆడాడు. ఒక ఎండ్‌లో బట్లర్ షాట్లు కొట్టడంలో ఇబ్బంది పడ్డప్పటికీ యశస్వి మాత్రం అస్సలు ఆగలేదు. దీంతో పవర్ ప్లేలోనే రాజస్తాన్ 60 పరుగులు దాటింది. మొదటి వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం పీయూష్ చావ్లా బౌలింగ్‌లో బట్లర్ అవుటయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన వారందరూ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. కానీ మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ మాత్రం అస్సలు వదలకుండా ఆడాడు. యశస్వి జైస్వాల్ సాధించిన 124 పరుగుల్లో 112 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు తను ఎంత వేగంగా ఆడాడు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.