Mumbai Indians vs Rajasthan Royals: ఐపీఎల్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌లో రాజస్తాన్ చెలరేగి ఆడింది. ముంబై ఇండియన్స్‌పై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాచ్‌లో పూర్తిగా యశస్వి జైస్వాల్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఎందుకంటే తను తప్ప మరే ఇతర బ్యాటర్ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), జోస్ బట్లర్ (18: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) రాజస్తాన్‌కు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే చెలరేగి ఆడాడు. ఒక ఎండ్‌లో బట్లర్ షాట్లు కొట్టడంలో ఇబ్బంది పడ్డప్పటికీ యశస్వి మాత్రం అస్సలు ఆగలేదు. దీంతో పవర్ ప్లేలోనే రాజస్తాన్ 60 పరుగులు దాటింది. మొదటి వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం పీయూష్ చావ్లా బౌలింగ్‌లో బట్లర్ అవుటయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన వారందరూ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. కానీ మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ మాత్రం అస్సలు వదలకుండా ఆడాడు. యశస్వి జైస్వాల్ సాధించిన 124 పరుగుల్లో 112 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు తను ఎంత వేగంగా ఆడాడు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.




పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అదే ముంబై ఇండియన్స్ గెలిస్తే వారు ఐదో స్థానం వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది.


రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్


రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
డోనోవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్


ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్


ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నేహాల్ వధేరా, రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, అర్జున్ టెండూల్కర్