Lucknow Super Giants vs Punjab Kings: ఐపీఎల్ 2023 సీజన్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితం అయింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అధర్వ తైదే (0: 3 బంతుల్లో), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (4: 4 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం కావడంతో పంజాబ్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడిన మాథ్యూ షార్ట్‌ను (34: 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా కృష్ణప్ప గౌతం అవుట్ చేశాడు. దీంతో 45 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత సికందర్ రాజా (57: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అయితే తనకు మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. కుదిరినంత సేపు పోరాడిన సికందర్ రాజా 18వ ఓవర్లో అవుటయ్యాడు. సికందర్ అవుటయ్యాక షారుక్ ఖాన్ (23 నాటౌట్: 10 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) వేగంగా ఆడి పంజాబ్‌ను గెలిపించాడు. లక్నో బౌలర్లలో కొత్త కుర్రాడు యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (74: 56 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్), కైల్ మేయర్స్ (29: 23 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) లక్నోకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ దశలో కైల్ మేయర్స్‌ను అవుట్ చేసి హర్‌ప్రీత్ బ్రార్ మొదటి వికెట్ దక్కించుకున్నాడు.
ఆ తర్వాత ఒక ఎండ్‌లో కేఎల్ రాహుల్‌ను ఉంచి మిగతా బ్యాటర్లు పెవిలియన్ వైపు వెళ్తూనే ఉన్నారు. ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేదు. ఓపెనర్లు ఇద్దరూ కాకుండా ఇంకెవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. మొదటి మ్యాచ్‌లో కెప్టెన్సీ చేస్తున్నప్పటికీ శామ్ కరన్ బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఏడు బౌలింగ్ ఆప్షన్లను శామ్ కరన్ ఈ మ్యాచ్‌లో ఉపయోగించాడు. తనే మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రబడ రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.