Royal Challengers Bangalore vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయం లభించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితం అయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (50: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ తరఫున మనీష్ పాండే (50: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇది ఢిల్లీకి వరుసగా ఐదో ఓటమి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డు మీద రెండు పరుగులు చేరేసరికి ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా, మిషెల్ మార్ష్, యష్ ధుల్ ఘోరంగా విఫలం అయ్యారు. తర్వాత కాసేపటికే డేవిడ్ వార్నర్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కేవలం మనీష్ పాండే మాత్రమే రాణించాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం నెమ్మదించింది. దీనికి తోడు బెంగళూరు పేసర్లు నిప్పులు చెలరేగడంతో పరుగులు రావడం మందగించింది. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితం అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ఫ్లెసిస్ (22: 16 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభం అందించారు. మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. ఫాఫ్‌ను అవుట్ చేసి మిషెల్ మార్ష్ ఢిల్లీకి తొలి వికెట్ అందించాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ అందుకుని ముందుకు వచ్చిన మహిపాల్ లోమ్రోర్ (26: 18 బంతుల్లో, రెండు సిక్సర్లు), విరాట్‌తో కలిసి వేగంగా ఆడాడు. వీరు రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఈ లోపే కింగ్ కోహ్లీ 33 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాతి బంతికే అవుటయి పెవిలియన్ బాట పట్టాడు. కాసేపటికే లోమ్రోర్ కూడా అవుటయ్యాడు. మ్యాక్స్‌వెల్ (24: 14 బంతుల్లో, మూడు సిక్సర్లు) కాసేపు సిక్సర్లతో అలరించాడు. కానీ బెంగళూరు మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో అనూజ్ రావత్ (15: 22 బంతుల్లో, ఒక ఫోర్) వేగంగా ఆడలేకపోయాడు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులకు పరిమితం అయింది.