Lucknow Super Giants vs Punjab Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ లక్నోకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ దశలో కైల్ మేయర్స్‌ను అవుట్ చేసి హర్‌ప్రీత్ బ్రార్ మొదటి వికెట్ దక్కించుకున్నాడు.


ఆ తర్వాత ఒక ఎండ్‌లో కేఎల్ రాహుల్‌ను ఉంచి మిగతా బ్యాటర్లు పెవిలియన్ వైపు వెళ్తూనే ఉన్నారు. ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేదు. ఓపెనర్లు ఇద్దరూ కాకుండా ఇంకెవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. మొదటి మ్యాచ్‌లో కెప్టెన్సీ చేస్తున్నప్పటికీ శామ్ కరన్ బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. ఏడు బౌలింగ్ ఆప్షన్లను శామ్ కరన్ ఈ మ్యాచ్‌లో ఉపయోగించాడు. తనే మూడు వికెట్లు దక్కించుకున్నాడు. రబడ రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్, కృష్ణప్ప గౌతమ్, ప్రేరక్ మన్కడ్, డేనియల్ సామ్స్


పంజాబ్ కింగ్స్ తుది జట్టు
అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా, సామ్ కరన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్


పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ప్రభసిమ్రాన్ సింగ్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, రిషి ధావన్